cloudfront

Advertisement


Home > Politics - Political News

వైఎస్‌ మార్కును దాటేసిన వైఎస్ జగన్!

వైఎస్‌ మార్కును దాటేసిన వైఎస్ జగన్!

కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న రోజుల్లో.. సంచలన నిర్ణయం తీసుకుని సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతర్గత కలహాలు, చంద్రబాబు రాజకీయం మధ్యన కకావికలం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఊపును ఇచ్చిన రాజకీయ వ్యూహం పాదయాత్ర. చేవేళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ వైఎస్ నాడు చేపట్టిన పాదయాత్ర సంచలనం.

మండుటెండలో వైఎస్ సాగించన నడకకు జనం బ్రహ్మరథం పట్టారు. కాళ్లు బొబ్బలెక్కి, తీవ్రమైన కష్టమే అయినా.. వైఎస్ పట్టు విడవకుండా యాత్రను సాగించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ ఎవ్వరూ ఊహించని స్థాయి విజయం సాధించింది అంటే.. అందుకు మొదటి కారణం చంద్రబాబు పాలనపై ప్రబలిన వ్యతిరేకత, రెండో కారణం.. పాదయాత్రతో వైఎస్ కల్పించిన నమ్మకం! వైఎస్ పాదయాత్ర సంచలనం అయ్యింది.

కాంగ్రెస్ పార్టీని కేవలం ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చింది. ఇక కేంద్రంలో కూటమి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందన్నా.. దానికి ఏపీలో ఆ పార్టీకి లభించిన బలం కూడా ఒక ముఖ్య కారణం అని వేరే చెప్పనక్కర్లేదు. వైఎస్ పాదయాత్ర ‘ప్రజా ప్రస్థానం’ పూర్తై పదహారేళ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ అదొక సంచలనమే. నాడు వైఎస్ తన పాదయాత్రతో నడిచిన మొత్తం దూరం 1,470 కిలోమీటర్లు కాగా, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి నడిచిన మొత్తం దూరానికి సంబంధించిన మైలు రాయిని దాటేశాడు.

జగన్ పాదయాత్ర దాదాపు పదిహేను వందల కిలోమీటర్లకు దగ్గర పడింది. ఈ రకంగా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర కన్నా జగన్ పాదయాత్ర సుధీర్ఘమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆ దూరాన్ని నడవగా.. విభజిత ఆంధ్రప్రదేశ్ లోనే అంతకు రెట్టింపు దూరం నడుస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి. జగన్ కూడా ఏమీ పూల బాట మీద నడవడం లేదు. తీవ్రంగానే కష్టపడుతున్నాడు. పట్టణాలను తప్పించి.. పల్లెల మీదుగా జగన్ రూట్ మ్యాప్ సాగుతోంది.

దీంతో చాలా వరకూ మట్టి రోడ్ల మీదే జగన్ పాదయాత్ర సాగుతోంది. అందులోనూ చుట్టూ వేలా మంది జనం. దీంతో.. విపరీతమైన స్థాయిలో దుమ్మూధూళీ రేగుతోంది. ఆఫీసుల్లో కూర్చుని పని చేయడం అలవాటై పోయిన వారికి అయితే.. రెండ్రోజులు అలా జనాల మధ్యన, ఆ స్థాయి దుమ్మూ ధూళికి నడిస్తే జ్వరం వస్తుంది. వాతావరణంలో కూడా మార్పు తీవ్రంగా ఉంటోంది.

రాయలసీమలో జగన్ పాదయాత్ర సాగినన్ని రోజులూ ఉదయం పూట విపరీతమైన చలి, మధ్యాహ్నానికి విపరీత స్థాయి ఎండ.. అలాంటి మార్పులకు శరీరం తట్టుకోవడం మామూలు విషయం కాదు. ఒకవైపు నడక, మరోవైపు చుట్టుముట్టే జనం.. ఇలాంటి పరిస్థితుల నడుమ నాలుగైదు నెలల నుంచి జగన్ యాత్రను సాగిస్తున్నాడంటే.. అతడి పట్టుదల ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ పాదయాత్రకూ చంద్రబాబు పాదయాత్రకు కూడా పోలిక పెట్టవచ్చు.

అయితే చంద్రబాబు నడక అంతా తెల్లవారుజాముల్లో, సాయంత్ర వేలల్లో సాగిందనేది బహిరంగ సత్యం. పల్లెల మీదుగా తెల్లవారుజాముల్లో సాగిన యాత్ర నాడు బహిర్భూమికి వెళ్లే ఆడవాళ్లను ఇబ్బంది పెట్టింది. ఇక పాదయాత్ర విజయవంతమా? కాదా? అంటే.. జగన్ యాత్రలో కనిపిస్తున్న జనమే అందుకు రుజువు. విజయవంతం అంటే తెలుగుదేశం వాళ్లు ఎలాగూ ఒప్పుకోరు. వారి ఒప్పుగోలుతో అవసరం లేదు కూడా.

అయితే.. ఈ యాత్రతో జగన్ సరికొత్తగా జనం ముందు నిలబడ్డాడు. ఈ యాత్రతో జగన్ తన పార్టీ రూట్స్ ను బలోపేతం చేయగలగడం విజయవంతం అవుతున్నాడని చెప్పడానికి ఏ మాత్రం మొహమాటపడనక్కర్లేదు. అంతే కాదు ‘ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం..’ అనే భావన తటస్థుల్లో కూడా కలిగిస్తోంది ప్రజాసంకల్పయాత్ర. చంద్రబాబు పాలన వైనం కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. క్షేత్ర స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోంది. రాజధాని కలల నగరంగానే మిగిలింది.

ఇప్పుడు తన వైఫల్యాలకు బీజేపీని బాధ్యులుగా చేసే పనిలో ఉన్నాడు చంద్రబాబు. ఇదే సమయంలో.. జనంలోకి దూసుకుపోతున్నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటి వరకూ జగన్ పాదయాత్రా దాదాపు సగం దూరం పూర్తి అయ్యింది. ఇక అసలైన సగం ముందుంది. మొత్తం పూర్తయ్యే సరికి రాజకీయ వాతావరణంలో మరిన్ని మార్పులు ఉంటాయి. మిగిలిన యాత్రకు కూడా ఇదే తరహా స్పందన వస్తే.. రాబోయేది జగన్ రాజకీయ ప్రభంజనమే అని చెప్పాలి.