cloudfront

Advertisement


Home > Politics - Political News

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి... లోపలి చూపు.!

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి... లోపలి చూపు.!

''ఏ నేషన్‌ దట్‌ ఫర్గెట్స్‌ ఇట్స్‌ పాస్ట్‌, హేజ్‌ నో ఫ్యూచర్‌'' (గతాన్ని మరచిపోయిన జాతికి, భవిష్యత్తు ఉండదు) అంటాడు విన్‌స్టన్‌ చర్చిల్‌. శిఖరాలను అధిరోహించే క్రమంలో ముందుచూపు మాత్రమేకాదు.. కిందిచూపు కూడా ఉండాలి. యుద్ధంలో విజయం సాధించి, అధికారాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహన్‌ రెడ్డి... అప్రమత్తంగా ఉండి, పరిసరాలను గమనించుకుంటూ సదా జాగరూకతతో మెలగుతూ... వాతావరణంలో ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయో గమనించుకుంటూ, శత్రువులు ఏమూలన నక్కి, ఏ వ్యూహాలతో పొంచి ఉన్నారో అంచనాకు వస్తూ సాగడం ఎంతో అవసరం.

అదే సమయంలో.. తనలోకి తాను చూసుకుంటూ, ఆత్మసమీక్ష చేసుకుంటూ, పార్టీ వ్యవహారాల్లో, నిర్వహణలో దొర్లుతున్న లోపాలు ఏమైనా ఉన్నాయేమో బేరీజు వేసుకుంటూ ఉండడం కూడా, అంతకంటె అవసరం. అసమానమైన ప్రజాదరణ ఉన్న ఎంతోమంది.. 'పార్టీ' అనే వ్యవస్థాగత నిర్మాణాన్ని క్రమపద్ధతిలో నిర్వహించలేక, చతికిలబడిన దృష్టాంతాలు ప్రజాస్వామ్య చరిత్రలో చాలా ఉన్నాయి. జగన్‌.. తనలో, తన పార్టీలో ఎలాంటి అంశాల గురించి సమీక్షించుకోవాలో... ''లోపలి చూపు'' ఆయనకు ఏ కోణంలో, ఎంతవరకు అవసరమో వివరించే చిన్న ప్రయత్నం.. ఈవారం గ్రేటాంధ్ర ఎక్స్‌క్లూజివ్‌ కథనం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రస్తుత ప్రభుత్వం పరిపాలనలో ఉన్న లోపాలను నేరుగా ప్రజలనుంచే తెలుసుకోవడం.. తదనుగుణంగా తమ పార్టీ లక్ష్యాలను పునర్నిర్దేశించుకోవడం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. అనుకున్న ప్రకారం... నిర్ణీత దూరాన్ని ఆయన పూర్తిచేస్తే గనుక.. ఈ పాదయాత్ర రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన నాయకుడు అయినా చేసిన అతిపెద్ద పాదయాత్ర అవుతుంది. గతంలో చంద్రబాబునాయుడు 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అదివరలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ ఇద్దరూ కూడా ఆయా పాదయాత్రలతో ప్రజల్తో మమేకమైన అనంతరం జరిగిన ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం జగన్‌ కూడా అదే లక్ష్యంతో సాగుతున్నారు.

ఆరునెలల పైబడి ఒక పార్టీ అధినేత పూర్తిగా పాదయాత్రలోనే నిమగ్నమై ఉన్నారు. మరో ఆరునెలలు, లేదా అంతకంటె తక్కువ వ్యవధిలో కూడా ఎన్నికలు రావచ్చుననే వదంతులు వ్యాపిస్తున్నాయి. మరి నాయకుడు మడమ తిప్పకుండా, చూపు మరల్చకుండా ఒకే పని (పాదయాత్ర)లో నిమగ్నమై ఉన్న తీరు, పార్టీకి చేటు చేస్తుందా? మేలు చేస్తుందా? యాత్రలో నడుస్తూనే ఉన్నప్పటికీ.. ఆయన ఎక్కడ మజిలీ వేస్తే అక్కడ.. దాదాపుగా పార్టీ కార్యకలాపాల సమీక్ష వంటి నిర్వహణను స్వయంగా చూసుకుంటున్నారు.

ప్రజా స్పందనను బేరీజు వేసుకుంటున్నారు. వ్యూహరచనలు, అభ్యర్థుల ప్రాథమిక జాబితా ఎంపికలు లాంటివి కూడా ఒకపక్క జరుగుతూనే ఉన్నాయి. జిల్లాల వారీగా నాయకులను పిలిపించుకుని యాత్రా శిబిరాలలోనే పార్టీ సమావేశాలు పెట్టుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదంతా మంచిదే! జగన్‌, ప్రజలు ఎగబడి ఆలకించేంత జనాకర్షకమైన హామీలను గుప్పిస్తూనే ఉన్నారు. ఇవి సరిపోతాయా? ఆయన ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల్లోని విశిష్టత నంతటినీ కాసేపు పక్కనపెడదాం. ప్రజలకు చేరువకావడానికి ఇంకా ఏం అవసరమో చూసే ప్రయత్నమిది.

పాదయాత్రలో దూసుకుపోతున్న జగన్‌లో, అంతర్‌ దృష్టి, ఆత్మసమీక్ష ఉంటున్నదా? లేదా? 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అనుకుంటూ ముందుకు సాగిపోయే బదులుగా.. ఓసారి వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను కూడా తరచి, తర్కించి పరిశీలించుకుంటే ఆయనకే మంచిది అనే అభిప్రాయాలు పలువురిలో వినిపిస్తున్నాయి. అటు పార్టీలోని కొందరు సీనియర్లు, పార్టీతో నిమిత్తం లేని  రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

ఒక్క గొంతుక చాలదు!

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పరిపాలన ఎలాఉంది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో మధ్యలో దళారీల పాత్ర ఎలా ఉంది. లబ్ధిదారులు పూర్తి సంతృప్తితో ఉన్నారా? ప్రభుత్వ పథకాలను పొందడంలో యాతన పడుతున్నారా? సంక్షేమ పథకాల అందజేతలో.. ప్రజలందరినీ సమానంగా చూస్తున్నారా? లేక, వివక్ష పాటిస్తున్నారా? ఈ విషయాల్లో చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాక్షాత్తూ చంద్రబాబు నిర్వహిస్తున్న పార్టీ సమావేశాల్లో.. కొందరునేతలు 'వైకాపా వారికి కూడా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు' అంటూ వారు రాష్ట్ర ప్రజలే కాదన్నట్లుగా, వారికి ఇవ్వడం నేరం అన్నట్లుగా పితూరీలు చెబుతున్నారంటే.. తెదేపా ఎలాంటి దుర్మార్గపు పోకడలు పోతున్నదో అర్థం చేసుకోవచ్చు.

మరి ఇలాంటి పోకడల్ని ఎప్పటికప్పుడు జగన్మోహన్‌రెడ్డి.. తన పాదయాత్రలో నిలదీస్తూనే ఉన్నారు. కానీ ఒక్కగొంతుక సరిపోతుందా? జగన్‌ రాష్ట్రంలో ఏదో ఒక మూల నడుస్తూ ఉంటారు. అక్కడ గుమికూడిన జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. ఆయన గొంతు రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తున్నదా అంటే అనుమానమే. అధినేత మాటను అందిపుచ్చుకుని రాష్ట్రమంతా దానిని వినిపింపజేయడం పార్టీ నాయకులు, శ్రేణుల పని. ఈ విషయంలో వారు వెనుకబడి ఉన్నారనే చెప్పాలి.

పార్టీలో స్తబ్ధత

జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన ప్రసంగాలు అంతో ఇంతో ప్రచారానికి నోచుకుంటున్నాయి. యాత్రలో జగన్‌ చెబుతున్న విషయాలను మినహాయిస్తే వైకాపా యాక్టివిటీ అంటూ రాష్ట్రంలో ఏమైనా కనిపిస్తోందా? తతిమ్మా నాయకులు ఎవ్వరూ అవసరమైనంతగా మాట్లాడడంలేదు. దీనివల్ల రెండు నష్టాలున్నాయి. (1) పార్టీ కార్యకలాపాలు చురుగ్గా ఉన్నాయనే అభిప్రాయం ప్రజలకు ఏర్పడకపోవడం. (2) తాను యాత్ర చేస్తుండగా పార్టీలో మరొకరికి పేరు రాకూడదని, వేరెవ్వరూ ఎస్టాబ్లిష్‌ కాకూడదని జగన్‌ కోరుకుంటున్నట్లు అనుకోవడం.

జగన్‌ కేంద్ర కార్యాలయంలో తిష్టవేసి ఉండే రోజుల్లో ఏదో ఒక పార్టీ కార్యకాలాపాలు, నాయకుల ద్వారా ప్రతిరోజూ జరుగుతూనే ఉండేవి. పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు నిరాటంకమైన రూట్‌మ్యాప్‌ ఉండేది. ప్రత్యేకహోదా గురించి గానీ, విభజన చట్టం హామీల గురించి గానీ.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న హడావిడి కంటె పెద్దస్థాయిలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తొలినుంచి చేస్తూనే ఉంది. తీరా ఎన్నికల సంవత్సరం వచ్చేశాక ఎందుకింత స్తబ్ధంగా ఉంటున్నారు.

యాత్ర మొదలైన తర్వాత.. ప్రతిపక్షాలన్నీ కలిసి నిర్వహించిన బంద్‌లో పాల్గొనడం మినహా, వైకాపా తనదైన ముద్రతో నడిపించిన గట్టి ప్రజాఉద్యమం లేదంటే అతిశయోక్తి, నిరాధార ఆరోపణ కాదు. ఏదో జగన్‌ను విమర్శించినప్పుడు, వైకాపా నాయకులు ఒకరిద్దరు ఒకటి రెండుచోట్ల డిఫెన్సివ్‌ ఎదురు విమర్శలు చేయడం తప్ప.. మరోరకం యాక్టివిటీ లేకుండా పార్టీ స్తబ్ధుగా పడిఉంది. అదే సమయంలో  తెలుగుదేశం ఇటు ప్రత్యర్థుల మీద విమర్శలతో విరుచుకు పడడమూ.. ప్రజల్లో నిత్యం కనిపించేలా ఏదో ఒక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడమూ రెండు మార్గాలుగా తమ వ్యూహాన్ని నడిపించుకుంటూ వెళ్తోంది.

తెదేపా అన్నేసి కార్యక్రమాలతో వెళుతున్నప్పుడైనా.. వైకాపాలో చురుకుపుట్టాలి కదా..? ఎందుకింత స్తబ్ధత ఆవరించింది. నాయకుడు, తన శ్రేణుల్లో ఎలాంటి కదనోత్సాహాన్ని రేకెత్తిస్తున్నట్లు? ఈ స్తబ్ధతకు కారణం పూర్తిబాధ్యత జగన్మోహన్‌ రెడ్డిదే అవుతుందా? లేదా? ఆలోచించుకోవాలి.

పోరాడే ఉద్దేశమే లేదా?

జగన్‌ దాదాపు రాష్ట్రంలోని ప్రతి ఊరికీ వెళ్తున్నారు. అక్కడి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇది నిజంగా గొప్ప ప్రయత్నం. జగన్‌ చేస్తున్న కృషి ఉత్తనేపోదు. ప్రజల ద్వారా తెలుసుకుంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమిటో రేపు పార్టీ మేనిఫెస్టోలో ప్రతిఫలిస్తుంది. ఆ రకంగా అప్పటికి ఆ ప్రజలకు నమ్మకం కలిగించడమూ కుదురుతుంది. కానీ.. సమస్యలను నివేదిస్తున్న ప్రతి ఒక్కరికీ.. 'మన ప్రభుత్వం రాగానే.. అన్నీ పరిష్కరిస్తా' అని మాత్రమే జగన్‌ చెబుతున్నారు. అంతేనా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా హోదా కలిగి ఉన్న పార్టీ నాయకుడు.. తనమీద ఆశలు పెట్టుకున్న ప్రజలకు చెప్పగలిగింది అదేనా? ప్రభుత్వం వస్తే చేస్తా అని చెప్పడానికి జగన్‌ ఎందుకు? దారినపోయే ఎవరైనా అలాంటి హామీ ఇవ్వగలరు

పాదయాత్ర మొదలెట్టిన తర్వాత.. ఇప్పటి దాకా ఏ ఒక్క ప్రజా సమస్య మీద కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోరాటం సాగించింది లేదు. మరి జగన్‌ స్వయంగా తెలుసుకుంటున్న సమస్యలన్నీ ఏ గంగలో కలుస్తున్నట్లు. జగన్‌ ఒక గ్రామంలో పర్యటించి కొన్ని సమస్యలను తెలుసుకున్నాడంటే.. ఆయన ఆ ప్రాంతం వీడిపోయే సమయానికి ఆ సమస్యల గురించి పార్టీ పెద్దస్థాయిలో ఉద్యమాలు ప్రారంభించాలి. జగన్‌ వచ్చి వెళ్లిన తర్వాతి డిఫరెన్స్‌ ప్రజలకు స్పష్టంగా కనిపించాలి. మీ సమస్యల కోసం నేను ఉద్యమిస్తున్నా.. అనే భావన కలిగించాలే తప్ప... నన్ను సీఎం చేయకపోతే, మీ సమస్యలను పట్టించుకోను.. అని నర్మగర్భంగా బెదిరిస్తున్నట్లుగా మాట్లాడితే ఎలా?

రాష్ట్రంలో సుమారు 70మంది ఎమ్మెల్యేలను తొలి ప్రయత్నంలోనే మీకు అందించిన ప్రజలకోసం మీరేం చేస్తున్నట్లు? వారి సమస్యలను పరిమార్చడానికి, మీరు ముఖ్యమంత్రి అయ్యే ముహూర్తం వరకు ఆగవలసిందే అంటే సబబేనా? ఇంత యాత్ర చేస్తున్నప్పుడు దృష్టికి వచ్చిన సమస్యల గురించి వాటి తీవ్రతను బట్టి.. స్థానిక/రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను తన యాత్రకు సమాంతరంగా నడిపించే ప్రయత్నం చేయాలి! 'నేను సీఎం అయితే మీకోసం పనిచేస్తా' అనడం ఘనతకాదు.. 'మీకోసమే పనిచేస్తున్నా.. ఈ దుష్ట ప్రభుత్వం స్పందించడంలేదు.. నేను సీఎం అయితే ఈ దుస్థితి ఉండదు' అనే విశ్వాసం కలిగించాలి.

అవును... జగన్‌ చేస్తున్నది బాబు భజనే!

జగన్‌ అభిమానులకు చేదుగా అనిపించినా ఈమాట నిజం. పెన్షన్లు తదితర వ్యవహారాల్లో జగన్‌ మాటలు చంద్రబాబు ఇమేజిని పెంచేలాగానే ఉంటున్నాయి. 'ఇపుడు 1200 ఉన్న పెన్షను రెండువేలు చేస్తా.. బాబు రెండువేలు ఇస్తే నేను మూడువేలు ఇస్తా' అనే టైపు హామీలు అధికారం కోసం పాడుతున్న వేలం పాటలా ఉన్నాయే తప్ప.. జనం కోసం చిత్తశుద్ధితో చెబుతున్నట్లుగా లేవు. పైగా, ఈ మాటలు ఎలా ఉన్నాయంటే.. ''బాబు చేస్తున్నది బాగుంది గానీ.. నన్ను సీఎం చేస్తే ఇంకా బాగా చేస్తా'' అని చెబుతున్నట్లుగా ఉంది.

రాజకీయంలో ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నప్పుడు ఇది పనికిరాదు. అలాగని మంచి పనిని తప్పుపట్టమని కాదు, మంచి పని అమలు తీరులో ఉన్న తప్పులను దిద్దడం గురించి ప్రయత్నం జరగాలి. అదేమీ లేకుండా.. కేవలం ఉన్న పథకాలకే బెనిఫిట్స్‌ డోసేజీ పెంచుతూపోతే.. ప్రజలు ఎందుకు నమ్మాలి? ఇవన్నీ సీఎంకావడం కోసం చెబుతున్న మాటలు అనే అనుకుంటారు. 'చంద్రబాబును మించి చేస్తా, మించి చేస్తా'.. అనే ప్రతిమాట కూడా.. ఇండైరెక్టుగా 'చంద్రబాబు మంచి చేస్తున్నారు' అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళుతుందని తెలుసుకోవాలి.

విమర్శల పట్ల ఉదాసీనత

తాను అనుకున్నది అనుకున్నట్లుగా ప్రచారం చేయడంలో చంద్రబాబునాయుడు  సిద్ధహస్తుడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌, భాజపాతో అంటకాగుతున్నట్లుగా ఆయన ఇప్పటికే సమర్థంగా బురద చల్లారు. ఇటు వైకాపా నుంచి కౌంటర్‌ లేకపోవడం వల్ల.. ప్రజలు ఆ విమర్శల్ని నమ్మవలసిన పరిస్థితి. అలా ప్రజలు నమ్మితే గనుక పార్టీకి చాలా పెద్ద ప్రమాదం. ఒకవేళ జగన్‌ రాజకీయ ప్రయోజనాల కోసం భాజపాతో మైత్రిని కోరుకున్నా సరే.. ఇలాంటి మౌనం తగనిపని. రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన ద్రోహంపై పెద్దస్థాయిలోనే దాడిచేయాలి. ఎన్నికల తర్వాత.. అప్పటి పరిస్థితులను బట్టి స్నేహంపై ఆలోచించుకోవాలి. లోపాయికారీగా లోలోపల స్నేహ ఒప్పందాలు చేసుకుని, పైకి కత్తులు దూసే పార్టీలు అనేకం ఉంటున్నాయి. స్నేహ ఒప్పందం ఉందో లేదో గానీ... భాజపా పట్ల అనుసరిస్తున్న మౌనం పార్టీకి చేటు చేసేదే.

కేవలం భాజపాతో మైత్రి విషయంలోనే కాదు, బుగ్గన వ్యవహారంలో కూడా, జగన్‌కు సంబంధించి కూడా, ఆయన పాదయాత్రలో మాట్లాడుతున్న అంశాలకు సంబంధించి కూడా.. తెలుగుదేశం నుంచి నిత్యం విమర్శలు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం గోబెల్స్‌ ప్రచార శైలిని నమ్ముకున్న పార్టీ. విమర్శలో నిజం ఉన్నా లేకపోయినా... ఒకే విమర్శను పదిమంది మాట్లాడితే.. పదిసార్లు మాట్లాడితే.. దాని ప్రభావం ప్రజల మీద ఎంతోకొంత ఖచ్చితంగా ఉంటుంది. జగన్‌ మరోసారి భంగపాటును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే.. ఇలాంటి విమర్శల గురించి తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అదికాదు.. పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు ఎదురుదాడులు చేయించడం కూడా ఎంతో అవసరం.

పార్టీ నేతలంతా ఏం చేస్తున్నట్లు?

జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు సరే. మిగిలిన నేతలంతా ఏం చేస్తున్నారు? అధినేత పార్టీ ఇమేజిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఓ మహాయాత్రను పాదాలపై మోస్తూ ముందుకు వెళుతున్నారు. సరే, వైకాపాలో 'ప్రముఖ నాయకులు'గా తమకు తాము అచ్చోసుకుని చెలరేగేవాళ్లంతా ఏం చేస్తున్నారు? అంతా ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటూ కాలం గడిపేసి... తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత.. టికెట్లు పుచ్చుకుని అధికారానికి ఆరాటపడతారా? ఇలాంటి నాయకుల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? అసలు నాయకులు ఏమీ పట్టనట్టుగా ఉండడానికి పరోక్షంగా జగన్‌ కారణం అవుతున్నారని కూడా కొన్ని విమర్శలు ప్రచారంలో ఉన్నాయి.

పార్టీలో తనకు తప్ప మరెవ్వరికీ ఇమేజి ఉండరాదని, ఎవరినీ ప్రజలు గుర్తించరాదని కోరుకునే మోనార్క్‌ టైపు జగన్‌... అని ప్రత్యర్థులు విమర్శించడానికి ఇలాంటి వాతావరణం ఆస్కారం కల్పిస్తోంది. ఈ పరిస్థితిని జగన్‌ సెట్‌ చేయాలి. ప్రతి నాయకుడు క్రియాశీలంగా ప్రజలతో మమేకం అయి ఉండేలా.. వారికోసం పనిచేస్తుండేలా.. రాష్ట్రస్థాయి నాయకులు నిత్యం ప్రత్యర్థి పార్టీలను ఢీకొడుతూ ఉండేలా కార్యచరణను సిద్ధంచేయాలి. తనతో నిమిత్తం లేకుండానే పార్టీ సమస్త కార్యాచరణ సజావుగా జరిగేలా బాధ్యతల వికేంద్రీకరణ చేయలేకపోతే గనుక.. దానిని జగన్‌ వైఫల్యం కిందనే భావించాల్సి ఉంటుంది.

హస్తిన పోరు ఆగితే ఆత్మహత్యా సదృశమే..

ఢిల్లీ వేదికగా గత పార్లమెంటు సమావేశాల సమయంలో వైకాపా ప్రజల దృష్టిలో శెభాష్‌ అనిపించుకుంది. అప్పుడు చేసిన రాజీనామాలు ఇప్పటి పార్లమెంటు సమావేశాల సమయానికి ఆ రాజీనామాలు ఆమోదం కూడా పొందాయి. ఇవి త్యాగాలు అని జగన్‌ ప్రకటించి.. వారిని అభినందించడంతోనే ఆ ఎపిసోడ్‌ మరుగున పడిపోయింది. ఇదే 'త్యాగాలు' తెదేపా చేసి ఉంటే ఎలా ఉండేది.. ఈ పాటికి రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ వారి త్యాగాల ప్రసంగాలు, కీర్తనలు, స్తోత్రాలు హోరెత్తిపోయి ఉండేవి. వారందరూ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు కదా.. రాష్ట్రమంతా తిరిగి పార్టీ చేసిన త్యాగం గురించి.. పోరాడుతున్న వైనం గురించి... ప్రచారం చేసుకునేలా.. జగన్‌ ఎందుకు దిశానిర్దేశం చేయలేకపోతున్నారు? ఇది ఎవ్వరికీ అర్థంకాని సంగతి.

అసలే కేంద్రంతో లాలూచీపడి ఉన్నారన్న విమర్శలు. దానికితోడు లోక్‌సభలో గళం వినిపించడానికి కూడా గతిలేనిస్థితి. ఇలాంటి నేపథ్యంలో.. తమ ఎంపీలు రాజీనామాలు చేసినా రాష్ట్రం కోసం కట్టుబడే ఉన్నాం అని నిరూపించాలి. పార్లమెంటు మొదలుకాగానే మాజీ ఎంపీలైనా సరే ఢిల్లీలోనే తిష్టవేయాలి. దీక్షలు చేయాలి. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులూ.. కుదిరితే పార్లమెంటు ఎదుటే, గాంధీబొమ్మ వద్దే రిలే నిరాహార దీక్షలతో అన్నిరోజులూ పోరాడాలి. కేవలం రాజీనామాలు చేసేసి... తాము చేతులు దులుపుకుని కూర్చోలేదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నాం.. అనే భావనను ప్రజలకు కలిగించాలి. తద్వారా చంద్రబాబు రాష్ట్రంలో చేస్తోంటే.. మేం ఢిల్లీలోనే చేస్తున్నాం.. వారు ఓట్లకోసం డ్రామా ఆడుతోంటే.. మేం రాష్ట్రంకోసం పోరాడుతున్నాం అని చెప్పగలగాలి.

రాజ్యసభలో పోరాటం చాలాకీలకం. పార్లమెంటులో వైకాపాకు ఉన్నది ఆ ఇద్దరు ఎంపీలే. అయినా రాబోయే సమావేశాల్లో వారితోనే పెద్ద పోరాటం సభలో నడిపించాలి. రాష్ట్రం చిత్తశుద్ధి సడలలేదు, పోరాటపథం నుంచి మరలలేదు అనిపించాలి. తద్వారా తమ మీద వస్తున్న లాలూచీ విమర్శలు, కట్టుకథలే అనే నమ్మకం ప్రజలకు కలిగించాలి.

బిస్కట్లు వేస్తే చాలదు

జగన్‌ యాత్ర మొత్తంగా సంక్షేమ పథకాల మోతాదు పెంచే హామీలతోనే సాగిపోతోంది. చంద్రబాబు సంక్షేమ పథకాలు అన్నింటినీ తాను మరింత డోసేజీ పెంచి ఇస్తానని జగన్‌ చెబుతున్నారు. ప్రజల విశ్వాసం చూరగొనాలంటే.. ఈ బిస్కట్లు వేయడం మాత్రం సరిపోదు. తన ప్రభుత్వం వస్తే పరిపాలన ఎలా ఉండబోతుందో.. ఇప్పడు ప్రతిదశలోనూ ఉన్న అవినీతిని ఎలా దూరం చేస్తామో జగన్‌ చెప్పాలి. చంద్రబాబు సర్కారులోనూ సంక్షేమ పథకాలున్నాయి. ప్రజలు వాటిని ఎంచక్కా అనుభవిస్తున్నారు.

కానీ.. పుట్టిన సర్టిఫికెటు, చచ్చిన సర్టిఫికెటు, చివరికి.. బతికిన సర్టిఫికెటు కావాలంటే కూడా... వీఆర్వో స్థాయి నుంచి... ఆయా పనులను బట్టి.. సచివాలయంలో అత్యున్నత స్థాయి అధికారుల వరకూ కూడా.. ప్రతిదశలోనూ చేతులు తడపాల్సిన పరిస్థితి. పేరుకు పారదర్శకత, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, ఆన్‌లైన్‌లోనే సమస్త సమస్యల పరిష్కారం అనేవి ప్రచారంలోనే ఉన్నాయి తప్ప.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందిని ఆశ్రయించకుండా.. వారిని 'గమనించుకోకుండా' పని చక్కబెట్టుకోగల పరిస్థితిలేదు. ఈ సంగతి ప్రజలందరికీ స్వానుభవంలో ఉన్నదే. ఇలా ప్రతిదశలోనూ వేళ్లూనుకుని ఉన్న అవినీతిని తాను దూరం చేస్తానని.. జగన్‌ ప్రజలకు నమ్మకం కలిగించాలి.

తన పరిపాలన వస్తే... సంక్షేమ పథకాల స్థాయి పెంచడం మాత్రమేకాదు, వాటి అమలు తీరులో స్వచ్ఛత, నిజాయితీని కూడా తీసుకువస్తానని చెబితే, నమ్మిస్తే ప్రజలు ఇప్పుడు పడుతున్న బాధలను ఈసడించుకుని పట్టంకట్టే ఛాన్సుంటుంది.

కనపడని నష్టాలున్నాయి...
'అందమైన అమ్మాయి ఉన్న ఓ బంగళా కిటికీ వైపు, రోడ్డు మీద నిల్చున్న కుర్రాడు చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడనుకోండి. నిజానికి ఆ బంగళా అమ్మాయికి అతనెవరో తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా వాడెవడో పిచ్చాడులే.. మనకు ఎలాంటి ఎఫైర్‌ లేనప్పుడు మనమెందుకు స్పందించాలి..' అనుకోవచ్చు. నిజానికి అలా అనుకోవడం తప్పు. ఆమె అలా ఊరకుండిపోతే...  ఆ కిటికీ ఆవల ఉన్న బంగళా ఇంటి అమ్మాయికి- అతనికి ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని.. రోడ్డు మీద ఆ కుర్రాడిని మాత్రం చూసిన ప్రజలు అనుకుంటారు. అలాంటి అబద్ధపు ప్రచారానికి ఆ అమ్మాయే ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. మరేం చేయాలి. ఎఫైర్‌ లేనప్పుడు మనకెందుకులే అనుకోకుండా, బంగళాలోంచి బయటకు వచ్చి ఆ కుర్రాడి దవడ పగలగొట్టాలి. -అలా చేస్తేనే ఇలాంటి దుష్ట ప్రచారాలు సాగకుండా ఉంటాయి.

మౌనంగా ఉండిపోతే ఇలాంటి 'పైకి కనపడని నష్టాలు' తప్పవు..
ప్రస్తుత రాజకీయాల్లో కత్తి మహేష్‌ ఎపిసోడ్‌ అలాంటిదే. ఇదే కత్తి మహేష్‌ తనకు తెదేపా తరఫున పోటీచేయాలని అని ఉంటే గనుక.. వాతావరణం ఎలా ఉండేది? రామాయణం పట్ల విశ్వాసం ఉన్న హిందూ సమాజం మొత్తం ఇవాళ ఈసడించుకుంటున్న వ్యక్తి.. తమపార్టీ మీద మనసు పడుతున్నాడని తెదేపా పండగ చేసుకుంటుందా? కనీసం మౌనంగా ఉంటుందా? ఆలోచించాలి. 'కత్తి మహేష్‌... వైకాపా నాయకుడే' అనిగానీ, 'ఇన్నాళ్లూ ఆయన వెనక ఉండి ఆడించింది వైకాపానే అన్న సంగతి తేలిపోయింది' అని గానీ ప్రచారం జరుగుతోన్నదంటే.. దానికి పార్టీ మౌనమే కారణం.

ఈ ప్రచారాల యెదుట 'తెలుగుదేశానికి భజన చేసే మీడియా సంస్థల ప్రాపకంతోనే ఆయన సెలబ్రిటీ అయ్యాడనే వాస్తవం మరుగున పడిపోయింది. ఇలాంటి కుయుక్తులను, దుష్ప్రచారాలను మొగ్గలోనే తుంచివేయాలి. ఈ దశలో జగన్‌కు ఉన్న రాజకీయ ప్రత్యర్థులు వ్యూహాల్లో ఉద్ధండులు. తమచేతికి మట్టి అంటకుండా.. కార్యం చక్కబెట్టగల చతురులు. కత్తి మహేష్‌ లాంటి శక్తులు అనేక కోణాల్లోంచి, కలుగుల్లోంచి పార్టీలోకి ప్రవేశించి, పార్టీ ముద్రను తమమీద తామే వేసుకుని.. తద్వారా పార్టీకి- చెరిపేసుకోలేని అపకీర్తిని కట్టబెట్టవచ్చు. ఇలాంటి వ్యవహారాలను ప్రాథమిక దశలోనే కట్టడిచేయడం కూడా పార్టీకి అవసరం.

అంతిమంగా...
2014లో సంపాదించినన్ని ఓట్లు, సీట్లు ఈసారి కూడా తెచ్చుకోగలిగే పరిస్థితిలో తెలుగుదేశం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. మితిమీరిన అవినీతి చాలాచోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద నమ్మకం పోగొట్టింది. చాలా సిటింగ్‌ సీట్లు వారికి ప్రతికూలంగానే ఉన్నాయి. ఆ రకంగా తమకు అదృష్టం కలిసివచ్చి అధికారంలోకి వస్తాం అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కలలు కంటున్నట్లుంది.

''తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తప్ప మరెవ్వరూ కాదు'' అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడంపై వారు పూర్తిగా దృష్టి పెట్టలేదు. పవన్‌, భాజపా ఎవరికి ఓటు వేసినా.. మీరు పరోక్షంగా మళ్లీ చంద్రబాబుకే అధికారం అప్పగించినట్లే! ఈ అవినీతిని ప్రోత్సహించినట్లే.. అనే ప్రచారాన్ని తీసుకెళ్లగలగాలి. చంద్రబాబు అవినీతి వద్దనుకుంటే.. మీ ఓటు జగన్‌కు అనుకూలంగా పడితేనే ప్రయోజనం ఉంటుంది... అనేది చెప్పగలగాలి.

భాజపాతో అంటకాగుతున్నారనే విమర్శలు విపరీతంగా ఉన్నాయి. ఆ విమర్శలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. ఒకవేళ నిజమే అయితే.. వారితో మైత్రి కోసం, రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితుల్లో తనచేతికి అధికారం దక్కగల అవకాశాన్ని పణంగా పెట్టడానికి జగన్మోహన్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఆ విమర్శలు నిరాధారాలని నిరూపించుకోవాలి. మసిగుడ్డ కాల్చి మొహాన వేసేవారు చాలామందే ఉన్నారు. దానిని శుభ్రం చేసుకోవడం ఇవతలి వారికే అవసరం..! ఈ సిద్ధాంతం గ్రహించాలి.
చంద్రబాబు గ్రాఫ్‌ ఇదివరకటి లాగా లేదు.. తగ్గింది. ఓకె.

జగన్‌ గ్రాఫ్‌ ఇదివరకటి కంటె కాస్త పెరిగింది. ఇది కూడా ఓకె.

విజయానికి, అధికారానికి ఇది సరిపోతుందా?

గతంలో ద్విముఖంగా ఉన్న పోటీ ఈసారి త్రిముఖం అవుతోంది!

విజయాభిలాషే ఉంటే.. విస్మరించరాని శక్తి పవన్‌.

అన్నింటినీ బేరీజు వేసుకుంటూ.. లోపాలను దిద్దుకుంటూ... ప్రతికూలతలను తట్టుకుంటూ... ప్రజా పోరాటాలకు పదును పెట్టుకుంటూ.. ముందుకు సాగితే మాత్రమే అనుకున్న అధికారం వరిస్తుంది.
-కపిలముని
kapilamuni.a@gmail.com