cloudfront

Advertisement


Home > Politics - Political News

వైఎస్సార్సీపీకి విషయం అర్థమైందా?

వైఎస్సార్సీపీకి విషయం అర్థమైందా?

అతి విశ్వాసానికి పోయి.. బేసిక్స్ మరిచిపోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏమీకాదు. ఇప్పుడు కూడా అదే దిశలో పయనిస్తోందా? అనే సందేహాలు కలుగుతూ ఉంటాయి. తాజాగా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించాడు. అందులో ప్రధానంగా బూత్ లెవల్ కమిటీల గురించి జగన్ మాట్లాడాడు. బూత్ స్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని జగన్ తన పార్టీ నేతలకు ఉద్బోధించాడు.

ఎలాగూ గెలిచేస్తున్నాం.. అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి గత ఎన్నికల్లో వైసీపీ వర్గాలు గత ఎన్నికల సమయంలో ఓట్లను కూడా సరిగా అడగలేదు. అందరూ తమకే వేసేస్తున్నారు ఇక ఎందుకు అడగడం అన్నట్టుగా కొంతమంది నేతలు ప్రవర్తించారు. దీంతో మొత్తానికే తేడాకొట్టేసింది. పోల్ మేనేజ్ మెంట్ అంటే ఏమిటో ఈ పాటికి అయినా వైకాపాకు అర్థమై ఉండాల్సింది. తన పార్టీ నేతలకు జగన్ ఈ విషయంలోనే తదుపరి బాధ్యతలను అప్పగించినట్టుగా ఉన్నాడు.

ఇక వైసీపీ ఇళ్లు మరిచిపోకుండా గమనించుకోవాల్సిన మరో విషయం ఓటర్ల జాబితా. ఈ మధ్యనే ఆ పార్టీ ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సానుభూతి పరుల ఓటర్లను తొలగించేశారని.. ఒక్కో నియోజకవర్గంలో కొన్ని వేల ఓటర్లను అనర్హులుగా ప్రకటించారని వైకాపా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయమై ఈసీని కూడా కలిశారు. ఈసీ ఏదో సర్ధిచెప్పి పంపించింది.

అయితే వైకాపా ఇలాంటి కంప్లైంట్లు చేసి ఊరుకుంటే ప్రయోజనం ఉండకపోవచ్చు. బూత్‌ల వారీగా ఎవరి ఓట్లు ఉన్నాయి, ఎవరెవరి ఓట్లు తొలగింపునుకు గురయ్యాయి? అనే అంశాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఓటు అర్హత ఉన్నా.. వైకాపా సానుభూతి పరులు అని తొలగింపునకు గురి అయిన ఓట్లను తిరిగి చేర్పించుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది.

దీన్ని వైకాపా ఉపయోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది. అలాకాకుండా.. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకా.. పోలింగ్ రోజున.. ఫలితాలు వచ్చాకా.. చంద్రబాబు నాయుడు అలా చేశాడు, ఇలా చేశాడు.. అంటే ప్రయోజనం ఉండదు. బాబుపై వ్యతిరేకత ఉంది.. అనేసి వైకాపా అప్పుడే సంబరాల్లో మునిగిపోతే మాత్రం మళ్లీ కథ మొదటికి వచ్చినా రావొచ్చు!