గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి. గ్రేటర్ పరిధిలోనే టాలీవుడ్ ప్రముఖులందరి ఓట్లూ ఉన్నాయి. అయినా ఈ ఎన్నికల విషయంలో టాలీవుడ్ స్పందించే పరిస్థితుల్లో లేదు.
టాలీవుడ్ తెలుగుదేశం పార్టీ వర్గమే అయినా, కొన్నేళ్లుగా తమ అవసరాల దృష్ట్యా టీఆర్ఎస్ నేతలతో కలిసి తరచూ కనిపిస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం వారు స్పందించడం లేదు.
ఇక జనసేనో కూడా ఊసులో లేదు కాబట్టి చోటామోటా కమేడియన్లు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి మాత్రం స్పందించారు. టీఆర్ఎస్ కు గ్రేటర్ లో పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కొంత అవేశంగా మాట్లాడారని, అయితే ప్రత్యేక తెలంగాణ వచ్చాకా హైదరాబాద్ లో ఆంధ్రా వాళ్లకు ఎలాంటి ఇబ్బందీ లేదని పోసాని అన్నారు.
కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి అని, టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని పోసాని అన్నారు. విభిన్న ప్రాంతాల వారి మధ్య కానీ, మతాల మధ్యన కానీ ఎలాంటి గొడవలు, వైషమ్యాలు లేని హైదరాబాద్ ను చూస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ను ఎన్నుకుంటే ఇదే ప్రశాంతత కొనసాగుతుందని పోసాని అభిప్రాయపడ్డారు.
ప్రెస్ క్లబ్ లో సమావేశం పెట్టి టీఆర్ఎస్ కు ఓటేయమని పిలుపునిచ్చారు పోసాని. దర్శకుడు ఎన్.శంకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.