టీడీపీ యువకిశోరం నారా లోకేశ్ ఓ మంచి పనిచేశాడు. జర్నలిస్టులను కరోనాతో కబళిస్తుండడం లోకేశ్‌ను కదిలించింది. జర్నలిస్టుల మృతిపై సంతాప ప్రకటనలు, సానుభూతి మాటలకు మాత్రమే పరిమితం కాకుండా పెద్ద మనసుతో ఆదుకునే ఆలోచన చేశాడు.
కరోనాతో మృత్యువాత పడ్డ జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పడకుండా వారికి తన శక్తి మేరకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చక్కటి ఆలోచన చేశాడు. జర్నలిస్టులకు బీమా స్కీమ్‌ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ స్కీమ్ తాను పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులకు మాత్రమే వర్తిస్తుంది.
మంగళగిరి నియోజకవర్గం పరిధిలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో పనిచేస్తోన్న ప్రింట్, ఎలక్ర్ట్రానిక్ మీడియా జర్న లిస్టులందరూ కలిపి మొత్తం 62 మంది ఉన్నారు. వీరందరికి బీమా ప్రీమియాన్ని నారా లోకేశ్ చెల్లించాడు. బీమా పొందిన జర్నలిస్టుల్లో ఎవరైనా సహజ మరణం (కరోనాతో చనిపోయినా) అయితే నామినీకి రూ.10 లక్షలు, ప్రమాదంలో మృతి చెందితే రూ.20 లక్షలకు బీమా వర్తించే పాలసీలను లోకేశ్ చేయించి పెద్ద మనసు చాటుకున్నాడు. త్వరలో ఇన్స్యూరెన్స్ ఫారాలను జర్నలిస్టులకు అందజేయనున్నట్టు లోకేశ్ తెలిపాడు. ఈ స్కీమ్ ఈ నెల 15 నుంచి వర్తిస్తుందని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరాడు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని, పిపిఈ కిట్లు అందజేయాలని, కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశాడు. ఏది ఏమైనా తన నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకున్న లోకేశ్‌ను తప్పుక అభినందించాలి.