జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ లో ఫైర్ ఉందని.. లీడర్ అంటూ గతంలో పొగిడిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు అదే పవన్ ను ఊసరవెల్లి అన్నారు. సీజన్ కు తగ్గట్టు మాటలు మారుస్తున్న పవన్ ను ఊసరవెల్లి అనాల్సి వస్తోందన్నారు.
“పవన్ కు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. పవన్ విషయంలో చాలా నిరాశచెందాను. ఆయన ఓ లీడర్, ఆయనకు ఓ పార్టీ ఉంది. మరో నాయకుడి భుజం ఎందుకు ఎక్కారు? 2014లో బీజేపీని సపోర్ట్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీని ద్రోహి అన్నారు. ఇప్పుడు మళ్లీ వాళ్లే ఆయనకు మహా నాయకులుగా కనిపిస్తున్నారు. 3-4 సార్లు మాట మార్చారు. అంటే పవన్ ఊసరవెల్లి అయి ఉండాలి.”
జాతి హితం కోసం బీజేపీకి మద్దతిస్తున్నారని పవన్ చెబితే జనాలు నమ్మరంటున్నారు ప్రకాష్ రాజ్. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నాయకుల మాటలు జాతి హితానికి తగ్గట్టు ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంతా కలిసి పవన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
“తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండండి. గత ఎన్నికల్లో అట్నుంచి ఇటు వచ్చిన వాళ్లకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి ఆయన చాలా పనుల్లో ఉన్నారు. కాబట్టి ప్రజలే బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. వీళ్ల వెనక వెళ్లిన మన వాళ్లకు కూడా ఓసారి గుణపాఠం నేర్పాలి.”
ఇలా పవన్ రాజకీయాల్ని నిశితంగా విమర్శించారు ప్రకాష్ రాజ్. దేశంలో జాతీయ పార్టీలన్నీ ఫెయిల్ అయ్యాయంటున్న ప్రకాష్ రాజ్.. తెలంగాణ ప్రజలంతా ఐకమత్యంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు.