నేను రిటైర్ అవుతున్నానంటూ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ట్విట్టర్ లో పెట్టిన పోస్టింగ్ సంచలనంగా మారింది. 25ఏళ్ల వయసులో సింధు ఎందుకు రిటైర్ అవుతోందంటూ ఆ పోస్టింగ్ చూసిన వెంటనే అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.
అయితే ఆమె ట్వీట్ మొత్తం చదివితే అసలు విషయం బోధపడుతుంది. నా టైటిల్ తో మీ అందరికీ మినీ హార్ట్ స్ట్రోక్ వస్తుందని ముందే అంచనా వేసిన సింధు.. టైటిల్ తో కన్ఫ్యూజ్ చేసిన లోపల అసలు మేటర్ చెప్పేసింది.
కరోనా లాక్ డౌన్ కాలంలో ఉన్న నెగెటివ్ మైండ్ సెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించింది సింధు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకుంటున్న సింధు.. ఇటీవల జరిగిన డెన్మార్క్ ఓపెన్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించలేకపోయింది.
కరోనా భయం వల్లే ఆమె డెన్మార్క్ ఓపెన్ ఆడలేకపోయింది. అయితే ఇప్పుడు తాను అలాంటి భయాలన్నిటికీ వీడ్కోలు పలికానని.. భయాలు, అపోహలకు తాను రిటైర్మెంట్ ప్రకటించానని చెప్పింది.
అయితే సింధు వేదాంత ధోరణిలో చేసిన ట్వీట్ పై పలు అపోహలు చెలరేగాయి. చాలామంది నేరుగా సింధు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అసలు విషయం అడిగి తెలుసుకున్నారు. అయితే ట్వీట్ లోనే తాను పూర్తి విషయం చెప్పానని, ఇంకా రిటైర్మెంట్ గురించి ఎందుకు అడుగుతారని ప్రశ్నించింది సింధు.
ఇక నెటిజన్లు.. ధోనీ రిటైర్మెంట్ తో పోల్చి మంచి కామెడీ మెసేజ్ లు పోస్ట్ చేశారు. అయితే సింధు ట్వీట్ చూసిన చాలామంది ఆమె రిటైర్మెంట్ ప్రకటించేసిందని అపోహపడి తర్వాత అర్థం చేసుకున్నారు.
ఒలింపిక్స్ లో భారత్ కు రజతం సంపాదించిన సింధుకి గతంలో ఏపీ ప్రభుత్వం సబ్ కలెక్టర్ ఉద్యోగం కూడా ఇచ్చింది. మరోవైపు ఆమె కోచ్ ను మార్చి ఇంగ్లాండ్ వెళ్లిపోయిందనే వివాదం కూడా నడుస్తోంది. ఈ వివాదం సద్దుమణగక ముందే.. రిటైర్మెంట్ అంటూ ట్వీట్ చేసి అందర్నీ కన్ఫ్యూజ్ చేసింది సింధు.