రాధా..ఈ రాతలు మానగ రాదా?

ఆత్మహత్యకు పాల్పడడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం చట్ట రీత్యా నేరం. ఘనత వహించిన, అనుభవం పడించుకున్న ఆంధ్రజ్యోతి సంపాదకులు రాధాకృష్ణకు ఈ సంగతి తెలిసే వుంటుంది. కానీ, తెలిసినా కూడా… Advertisement ''…చరిత్రలో ఒక జాతి…

ఆత్మహత్యకు పాల్పడడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం చట్ట రీత్యా నేరం. ఘనత వహించిన, అనుభవం పడించుకున్న ఆంధ్రజ్యోతి సంపాదకులు రాధాకృష్ణకు ఈ సంగతి తెలిసే వుంటుంది. కానీ, తెలిసినా కూడా…

''…చరిత్రలో ఒక జాతి సామూహిక ఆత్మహత్యకు ఈ తరం సాక్షీ భూతంగా నిలవబోతోందా?..''

''….అమరావతిని చంపేయడానికి అక్కడ కమ్మ సామాజికవర్గం వారికి కూడా భూములు ఉండటం కారణమైతే ప్రభుత్వం అదే విషయం ప్రకటించాలి. అదే నిజమైతే నష్టపరిహారం చెల్లించి వారిని అమరావతి నుంచి తరిమేయండి. కులం మార్చుకోవడం సాధ్యం కాదు కనుక.. మత మార్పిడి చేయించండి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కారణమైతే ‘‘బాబూ! 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నావు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లకుపైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావుగా? ఇక చాలు రాజకీయాల నుంచి తప్పుకో’’ అని చెప్పండి….''

అని రాయడం ఎంత వరకు సబబు? సరే, రాశారు అనుకుందాం? ఇంతకీ సమస్య ఏమిటి?

అమరావతిని సోలో రాజధానిగా కాకుండా, మూడు రాజధానుల్లో ఒకటిగా మార్చడం వల్ల, అక్కడవున్న కమ్మ సామాజిక వర్గం మొత్తం అన్యాయమై పోయి, ఆత్మహత్యాసదృశం అన్నట్లుగా వుంటుంది పరిస్థితి అని ఆర్కే అంచనా వేస్తున్నారు. అంతే కదా? సరే, ఎప్పటికా మాట మార్చడం అన్నట్లుంది వ్యవహారం. ఈ లైన్ చూడండి.

''….ఇవ్వాళ హైదరాబాద్‌ మహా నగరంగా అభివృద్ధి చెందిందంటే అందుకు ఎన్‌టీఆర్‌, చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌ రెడ్డిలు చేసిన కృషి కారణం కాదని ఎవరనగలరు?..''

ఇదేంటీ హైదరాబాద్ అభివృద్ది అంతా తనదే అని చంద్రబాబు ఎన్నాళ్లుగానో చెబుతూ వస్తుంటే, అదే నిజమని, ఆయన అనుకూల మీడియా టముకేస్తూ వస్తుంటే, ఇప్పుడు ఆర్కే ఇలా రాశారు? హైదరాబాద్ ప్రగతి సాధనలో ఎన్టీఆర్ కు, వైఎస్ఆర్ కు కూడా వాటా ఇచ్చేసారు?

సరే, ఆ సంగతి అలా వుంచుదాం?

అసలు అమరావతికి ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి? అది తెలియాలంటే రాజధానిగా ప్రకటించకముందు అమరావతి ఏమిటి? పచ్చటి చేలు. పసుపు, మిరప, కూరగాయలు ఇంకా రకరకాల వాణిజ్య పంటలు. సరైన నీటి సదుపాయం వున్న మాంచి వ్యవసాయ భూములు. రైతులకు మాంచి ఆదాయం ఇచ్చే భూములు. ఈ భూములు ఇవ్వడానికి చాలా మంది రైతులు అప్పట్లో ససేమిరా అన్నారు. వాళ్లను బుజ్జగించడానికి అప్పట్లో పవన్ కళ్యాణ్ ను కూడా పంపారు. ఆయన వెళ్లి, రచ్చబండ మీద కూర్చుని, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోను అని హెచ్చరించి, అదే రచ్చబండపై పెరుగన్నం తిని మరీ వచ్చారు.

రాను రాను జనాభా పెరుగుతోంది. సరిపడా ఆహార దినుసులు లేక రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి. ఇటీవల పెరిగిన ఉల్లి ధరే అందుకు నిదర్శనం. అదే 30 వేల ఎకరాల్లో ఆహార దినుసుల ఉత్పత్తి జరిగితే, ఎంత సరుకు మార్కెట్ లోకి వస్తుంది. ఎంత ఉపయోగం?  ఈ సంగతి విస్మరిస్తే ఎలా? 

పైగా ఆర్కే చెబుతున్న కమ్మ సామాజిక వర్గం కష్ట జీవులు. వ్యవసాయం అంటే ఇష్టపడేవారు. అలాంటి వారికి తమ వ్యవసాయ భూములు తమకే వుంటే అంతకన్నా ఆనందం మరేం వుంటుంది? సమస్య ఏదైనా వుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే కూడా ఎక్కువ మక్కువ వున్నవారికే.

అమరావతిలో రాజధాని వస్తే, భూముల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయని ముందుగా అంచనా వేసి, భారీగా భూములు కొన్నవారే ఇప్పుడు ఇబ్బంది పడాల్సింది. వారిలో కమ్మవారు వుండొచ్చు. మరెవరైనా వుండొచ్చు. అంత మాత్రం చేత, ఇంత స్థాయి దిగి వ్యాసాలు రాయడం సరైనదేనా? అసలు కృష్ణ, గుంటూరు జిల్లాలు కేవలం కమ్మవారివే అని రాధాకృష్ణ ఎలాఅనుకుంటున్నారు. విజయవాడలో కాపులు, బ్రాహ్మణులు, గుంటూరులో కాపులు, వైశ్యులు, ఇతర సామాజిక వర్గాలు లేవా? వారందరినీ రాధాకృష్ణ విస్మరించారా? అంటే అమరావతి వల్ల కేవలం కమ్మ సామాజిక వర్గమే లబ్ధి పొందుతోందని, అందుకే జగన్ రాజధాని మార్చేస్తున్నారని ఆయన డిసైడ్ అయిపోయారా?

సరే, ఆ విషయమూ అలా వుంచుదాం. అసలు పరిపాలనా రాజధాని మార్చుతున్నాం అన్నారు కానీ, అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెట్టవద్దని జగన్ అన్నారా? పరిశ్రమలు పెట్టవద్దని అన్నారా? లేదు కదా? మరి కమ్మ సామాజిక వర్గంలో హేమా హేమీలు వున్నారు. మీడియా, సినిమా, పారిశ్రామికరంగంలో అగ్రస్థానంలో వున్నారు. మరి రాధాకృష్ణ ప్రవచించినదే నిజమనుకుంటే వీరంతా పూనుకుని,అమరావతిలో తమ తమ వ్యాపారాలు ప్రారంభిస్తే అభివృద్ది అద్భుతంగా వుంటుంది కదా? మరి ఆ ధిశగా గత అయిదేళ్లుగా ఎందుకు ఆలోచించలేదు? కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే వ్యాపారం అనే దిశగా ఎందుకు ముందుకు వెళ్లారు. ఇప్పుడు అదే కుదేలవుతుందని ఎందుకు గగ్గోలు పెడుతున్నారు.

అన్నింటికి మించి అభివృద్ధి అమరావతికే స్వంతమా? ఉత్తరాంధ్రకు వద్దా? రాయలసీమకు వద్దా?

కాస్త ఆలోచించి, ఆఫై జనాలను రెచ్చగొడితే బాగుంటుందేమో?

ఆర్వీ