ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పోల్చుకున్నారు. గత రెండేళ్లుగా సొంత ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్న సంగతి తెలిసిందే.
రఘురామకు తగ్గట్టే అధికార పార్టీ కూడా తానేం తక్కువ కాదన్నట్టు మరో రకమైన అస్త్రాలను విసిరింది. వైసీపీ వర్సెస్ రఘురామ సీరియల్ గత కొంత కాలంగా సాగుతూనే ఉంది. దీనికి ముగింపు ఎక్కడో తెలియడం లేదు.
ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించడంపై రఘురామ తనదైన స్టైల్‌లో వెటకరించారు. మూడు రాజధానులుకు ప్రజలు జై కొట్టారని పరిషత్ ఎన్నికలు ఫలితాలు రుజువు చేశాయి అంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
రోడ్లు వద్దు, ఉద్యోగాలు భర్తీ వద్దు, సిపిస్ రద్దు వద్దు అని, పరిశ్రమలు అభివృద్ధి వద్దు అని సహ జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలు సమర్ధించినట్లా? అని ఆయన ప్రశ్నించారు.
తమ ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి కదలటం లేదని, అలాగే తాను ఢిల్లీ నుంచి కదలడం లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తమ ఇద్దరి పరిస్థితి ఒకటేనని ఆయన అనడం గమనార్హం.
ఇదిలా వుండగా మార్గాని భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపణలుపై సీఎం చర్యలు తీసుకోవాలని రఘురామ సూచించడం విశేషం. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చాలా కాలం క్రితం ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ఆయన నిలదీశారు.