రాజకీయాల్లో అవకాశాలు ఊరికే రావు. వచ్చినవాటిని సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగేవారు కొందరైతే.. ఒక్కసారిగా వచ్చిన విజయాల్ని చూసి పొంగిపోయి, రెచ్చిపోయి ఆ తర్వాత అథఃపాతాళానికి పడిపోయేవారు మరికొందరు. ఈ రెండో కోవలోకి చేరిన వ్యక్తి రఘురామకృష్ణంరాజు.
వైసీపీతో ప్రయాణం మొదలు పెట్టి, సీటు ఇవ్వలేదనే కోపంతో.. ఆ తర్వాత బీజేపీలో చేరి, కొన్నాళ్లకు టీడీపీ పంచన చేరి.. ఫైనల్ గా 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరి లోక్ సభ టికెట్ సంపాదించి ఎంపీగా ఎన్నికయ్యారు రఘురామ. పార్టీలు మారినా చివరకు జగన్ ఇమేజ్ తో గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టి, అదృష్ట జాతకుడు అనిపించుకున్నారు. అయితే స్వయంకృతాపరాథం ఆయన్ను ఇప్పుడు జైలుపాలు చేసింది, అంతకంటే మరింత కిందకు దిగజార్చుతోంది.
ఎంపీ విజయసాయి రెడ్డి మాటల్లో చెప్పాలంటే.. “దిగజారుడు అనేది జారుడు బండలాంటిది. పతనం పైపు, వెనక్కి రాలేనంతగా నెడుతూనే ఉంటుంది. ఎవరో రెచ్చగొడితే, ఈలవేస్తే, అన్నీ వదిలేసి బట్టలు చించుకుంటే ఇలాగే ఉంటుంది, స్వయంకృతానికి బాధ్యులుండరు.” అంటూ ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు పరిస్థితిని చక్కగా వర్ణించారు విజయసాయిరెడ్డి.
టీడీపీ జనాలు రెచ్చగొట్టారా, బీజేపీ నాయకులు ఎగదోశారా అనేది అప్రస్తుతం. రఘురామ మాత్రం రెచ్చిపోయారు, విజ్ఞత వదిలేసి విచ్చలవిడిగా ప్రవర్తించారు. తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారు. సీఎం జగన్ ని విమర్శించేవారు, దెప్పిపొడిచేవారు, ఆయనంటే గిట్టనివారు ఏపీ రాజకీయాల్లో చాలామందే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఇంత దారుణమైన కామెంట్లు చేసిన వ్యక్తిని ఎక్కడా చూసి ఉండం.
ఒక పార్టీలో ఉంటూ, ఆ పార్టీ గుర్తుపై గెలిచి, అదే పార్టీ అధినేతను తిట్టారు రఘురామ. రేపు మరో పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడిని కూడా తిట్టరని గ్యారెంటీ ఏంటి..? రఘురామకృష్ణంరాజుని చేరదీయాలనుకునే వారెవరైనా ఇదే విషయాన్ని కచ్చితంగా ఆలోచిస్తారు. పార్టీ అధికారంలో ఉన్న విషయం కూడా మరచిపోయి, ఫలితాలొచ్చిన నెలల వ్యవధిలోనే ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగిపోయిన ఇలాంటి వారిని ఇక ఏ పార్టీ అయినా ఎందుకు చేర్చుకుంటుంది? ఎలా దగ్గరకు తీస్తుంది?
రచ్చబండ పేరిట రకరకాల ఆరోపణలు చేయడమే కాదు, రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు రఘురామకృష్ణంరాజు. ఓ సామాజిక వర్గానికి బద్ధశత్రువుగా మారిపోయారు. రేపు మరో రాజకీయ పార్టీలో చేరితే, ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తే.. ఆయన కించపరిచిన కులంవాళ్లు ఒక్కరైనా ఓటు వేస్తారా? ఆయనకే కాదు, ఆయన ఉన్న పార్టీని కూడా సదరు సామాజిక వర్గం బహిష్కరిస్తే పరిస్థితి ఏంటి? అందుకే ఆయన్ను ఎవరూ పార్టీలో చేర్చుకునే పరిస్థితే లేదు.
అంతెందుకు.. ఇప్పుడింతలా సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు సైతం రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరతానంటే ఒప్పుకుంటారా..? ఒకవేళ ఒప్పుకున్నా 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తారా..?
సొంత సామాజిక వర్గానికి కూడా శత్రువే..
పోనీ సొంత సామాజిక వర్గంలో అయినా రఘురామ గౌరవం నిలుపుకున్నారా అంటే అదీ లేదు. సొంత జిల్లాకు చెందిన క్షత్రియులే, ఆయన్ను చీడపురుగు అనేశారు. తమ సామాజిక వర్గానికి పట్టిన దరిద్రం అని చీదరించుకున్నారు. ఎలా చూసినా.. రఘురామ తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నారు.
రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆయనకు డబ్బు ఉంది, వ్యాపారాలున్నాయి. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. కానీ ఏం లాభం, పరువు పోయింది. రాజకీయ భవిష్యత్ మంటగలిసింది.