ర‌ఘురామ లాజిక్‌..వారెవ్వా!

క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు ఉప ఎన్నిక‌పై న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు భ‌లే లాజిక్ తీశారు. ఆయ‌న లాజిక్ గురించి తెలుసుకుంటే, త‌న‌లో ఆ ఆలోచ‌న వుందో లేదో తెలియ‌ని బీజేపీ కూడా “వారెవ్వా” అన‌కుండా…

క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు ఉప ఎన్నిక‌పై న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు భ‌లే లాజిక్ తీశారు. ఆయ‌న లాజిక్ గురించి తెలుసుకుంటే, త‌న‌లో ఆ ఆలోచ‌న వుందో లేదో తెలియ‌ని బీజేపీ కూడా “వారెవ్వా” అన‌కుండా ఉండ‌దు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాల‌పై ప్ర‌తిరోజూ ర‌న్నింగ్ కామెంట్రీ చేయ‌డం ర‌ఘురామ ఒక ఉద్యోగంగా పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో బ‌ద్వేలు ఉప ఎన్నిక‌పై ఆయ‌న త‌న కోణంలో ఆస‌క్తిక‌ర అంశాల‌ను తెర‌పైకి తెచ్చారు. బ‌ద్వేలు ఉప ఎన్నిక బ‌రి నుంచి జ‌న‌సేన‌, ఆ త‌ర్వాత టీడీపీ వ‌రుస‌గా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌, బీజేపీలు బ‌రిలో నిలిచేందుకు నిర్ణ‌యించాయి. అయితే బీజేపీ పోటీ చేయ‌డం వెనుక ఆ పార్టీ ఉద్దేశాల్ని ర‌ఘురామ చెప్పుకొచ్చారు. ఆయ‌న ఏమంటారంటే…

“గ‌త ఎన్నిక‌ల్లో బ‌ద్వేలులో బీజేపీకి 735 ఓట్లు వ‌చ్చాయి. ఇప్పుడు అభ్య‌ర్థిని నిల‌బెడితే ప‌ది రెట్లు పెరిగినా… 8 వేల లోపు వ‌స్తాయి. అభ్య‌ర్థిని నిలిపి వైసీపీకి అత్య‌ధిక మెజార్టీ వ‌చ్చింది. ప్ర‌జ‌లు వైసీపీ వైపు ఉన్నార‌నే ప్ర‌చారానికే బీజేపీ పోటీ చేస్తున్న‌ట్టుగా ఉంది” అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ర‌ఘురామ చెప్పిన‌ట్టుగానే, మ‌రి వైసీపీకి అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ ఉండ‌డం వ‌ల్లే తాను ఆరాధిస్తున్న టీడీపీ, జ‌న‌సేన క‌నీసం బ‌రిలో నిలిచేందుకు కూడా భ‌య‌ప‌డ్డాయ‌నే వాద‌న మాటేమిటి?  కింద‌ప‌డ్డా అదో ల‌గువు అన్న‌ట్టుగా వుంది ర‌ఘురామ వాద‌న‌.