చెడపకురా చెడేవు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని గత కొన్ని నెలలుగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు వివిధ సంస్థలు, వ్యక్తులు తోడయ్యారు. అయితే తామొకటి తలిస్తే, కాలం మరొకటి చేస్తోంది. పడ్డవాళ్లెప్పుడు చెడ్డవాళ్లు కాదనే సామెత చందాన… గత కొంత కాలంగా వివిధ వ్యవస్థల పుణ్యమా అని జగన్ ప్రభుత్వం రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాటన్నింటిని భరిస్తోంది. సహనం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో జగన్ ప్రభుత్వమే ఉదాహరణ.
సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు పనిగట్టుకుని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈయనకు ఎల్లో మీడియా, టీడీపీ తోడయ్యాయి. మీడియా స్వేచ్ఛ ముసుగులో రఘురామతో గంటల తరబడి ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ, జగన్ ప్రభుత్వంపై ఇష్టానుసారం దాడి చేయిస్తూ వచ్చాయి. ఇదేమని ప్రశ్నిస్తే, మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా? అంటూ దబాయింపు. వీటన్నింటిని జగన్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ వస్తోంది.
అయితే తెలివితేటలు తమక్కొరికే సొంత మని భావించడం వల్లే వాళ్లు ఇబ్బందుల్లో పడ్డారు. ఏపీ సీఐడీ పక్కాగా రఘురామతో పాటు ఎల్లో చానళ్లపై కేసులు నమోదు చేసింది. రఘురామను అరెస్ట్ కూడా చేసింది. ఆయన సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి లోతైన విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఏపీ సమాజం నివ్వెర పోయేలా నిజాలు గత మూడు రోజులుగా ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.
ఏం మాట్లాడాలో రఘురామకు ఎల్లో మీడియా అసైన్‌మెంట్, ప్రశంసలు, అలాగే జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ వెనుక దురుద్దేశాలు, చంద్రబాబు, లోకేశ్ ప్రమేయం, జడ్జిలపై దూషణలు ఇలా అనేక విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం న్యాయ వ్యవస్థపై జగన్ దాడి చేస్తున్నారని కేకలు వేస్తున్న వాళ్ల నోటి నుంచి వచ్చిన మాటలేనా ఇవి? అని లోకేశ్, రఘురామ చాటింగ్ చూసిన వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
ఇక ప్రైవేట్ సంభాషణల్లో ఇంకెంతగా నోరు పారేసుకుని ఉంటారో కదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. రఘురామ సెల్‌ఫోన్ వాళ్ల గుట్టును రట్టు చేయడంతో, ఎల్లో గ్యాంగ్ నోరు మెదపలేని దుస్థితి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువంటారు. గత కొంత కాలంగా రఘురామను అడ్డు పెట్టుకుని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా నానా యాగీ చేయడం చూసిన వాళ్లకు జగన్ ప్రభుత్వానికి ఏదో అవుతోందని భావించారు.
చివరికి సుప్రీంకోర్టుకు సీఐడీ అఫిడవిట్ సమర్పించడతో అందరూ ఆత్మరక్షణలో పడ్డారు. ప్రతి ఘటన వెనుక ఓ నీతి ఉన్నట్టే, రఘురామ ఎపిసోడ్‌లోనూ ఉంది. అది ఏమంటే… ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టాలని కుట్రలు పన్నితే, అందులో మనం కూడా ఇరుక్కుంటాం. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం. ప్రకృతి కంటే మనిషి ఎప్పటికీ గొప్పవాడు కాదు.
ఏపీ రాజకీయ చరిత్రలో రఘురామ ఉదంతం భవిష్యత్ తరాలకు ఓ హెచ్చరిక అని చెప్పక తప్పదు. తమను తాము ఎక్కువ ఊహించుకుని అతి చేస్తే … చివరికి ఏ గతి పడుతుందో భావితరాలకు ఓ గుణపాఠంగా మిగుల్చుతుందని చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఇలాంటి క్యారెక్టర్లు ఓ సందేశాన్ని ఇవ్వడానికే వస్తుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.