కాస్త కామన్ సెన్స్ తో మాట్లాడుకుందాం… సీబీఐ తనపై నమోదు చేసిన కేసుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నాడనే అనుకుందాం. మరి అలాంటప్పుడు అభ్యంతరం ఎవరు వ్యక్తం చేయాలి? ఆ విషయంలో ప్రథమంగా స్పందించాల్సింది సీబీఐ.
జగన్ పై నమోదైన కేసులను విచారిస్తున్న అధికారులు కోర్టుకు ఈ ఫిర్యాదు చేయవచ్చు. అయ్యా.. మేం జగన్ కేసులను విచారిస్తుంటే, సాక్ష్యులు ఇలా అడ్డం తిరిగారు, లేదా వారిని జగన్ ఫలానా విధంగా భయపెట్టారు అని కోర్టుకు విన్నవించవచ్చు.
అయితే జగన్ పై కేసులను విచారిస్తున్న సీబీఐ నుంచి ఇప్పటి వరకూ అధికారికంగా పిటిషన్లూ కోర్టులో పడినట్టుగా లేవు. ఇక స్వయంగా సాక్ష్యులే కోర్టుకు ఫిర్యాదు చేయాలి. తాము జగన్ పై నమోదైన కేసుల్లో సాక్ష్యం ఇవ్వాల్సిన వాళ్లమని, తమను జగన్ బెదిరిస్తున్నాడని, ఆయన బయట ఉంటే తమకు హాని అని వారు కంప్లైంట్ ఇవ్వాలి. అలాంటిది కూడా ఏమీ లేదు.
ఆ మధ్యనే ఏపీలో ఒక పెద్ద హోదాలో పని చేసినాయన.. ఈ విషయంలో స్వయంగా సీఎం జగన్ నే బెదిరించారు. అది కూడా బహిరంగంగా. తను చెప్పినట్టుగా చేయడానికి జగన్ ప్రభుత్వం నిరాకరిస్తూ ఉండటంతో, తను ఆయనపై నమోదైన కేసుల్లో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుందంటూ ఆయన రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉంటూ మరీ హెచ్చరించారు! సాక్ష్యే అలా బాహాటంగా వ్యాఖ్యానించిన వైనం, అనేక మందిని ఆశ్చర్యపరిచింది. చివరకు ఆయన తన పంతాన్ని నెగ్గించుకున్నారు, ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే.
ఈ కేసుల్లో రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేసినప్పుడే.. ఈయనకేం సంబంధం అసలు? అనే సందేహం కామన్ మ్యాన్ లో జనించింది. కోర్టు ఇలాంటి పిటిషన్ల విషయంలో కాస్తైన లాజిక్ గా ఆలోచిస్తుంది కదా.. మధ్యలో నీ ఆసక్తి ఏమిటి? అని ప్రశ్నిస్తుంది కదా అని సామాన్యులు అనుకున్నారు. ఎందుకంటే గతంలో ఇలాంటి కేసుల్లో పిటిషనర్ ఆసక్తి ఏమిటని కోర్టు ప్రశ్నించిన వార్తలను అంతా చదివే ఉంటారు. బహుశా ఈ కేసులో కూడా పిటిషనర్ కు ఆ ప్రశ్న తప్పదనుకున్నారు.
ఎలాగైతేనేం.. రఘురామకృష్ణంరాజు పిటిషన్ సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. సీబీఐని కోర్టు అడిగింది. ఈ వ్యవహారంలో తమ ఆసక్తి కానీ, అనాసక్తిని కానీ సీబీఐ ప్రదర్శించలేదు. చివరకు రఘురామకృష్ణంరాజు పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆఖర్లో హైడ్రామాను నడిపించే ప్రయత్నం చేసి ఆయన భంగపడ్డారు.
అయినా దీన్ని ఆయన వదలరట. హైకోర్టులో పిటిషన్ వేస్తారట. మరి కింది కోర్టులో .. ప్రాథమిక అంశాలకు సమాధానాలను ఇచ్చుకోలేకపోవడంతోనే రఘురామ పిటిషన్ కొట్టివేతకు గురయ్యింది. అలాంటిది పై కోర్టుకు పోగానే మారిపోతుందా? అనుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమందికి కావాల్సింది బెయిల్ పిటిషన్ రద్దు కావడం కాకపోవచ్చు. దాన్ని ఒక చర్చలో పెడితే.. వాళ్లకు అదో తుత్తి అంతే!