రెండురోజుల క్రితం సొంత పార్టీ నేతలతో చీవాట్లు తిన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవహారశైలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. జగన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అసలు నీకు సిగ్గుందా? అని జగన్‌ను ఆయన ప్రశ్నించడంతో … ఔరా ఎంత మాటన్నావ్ రామకృష్ణా అనే వాళ్లే ఎక్కువ.
జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వల్లెపు అశోక్ అలియాస్ అక్కులప్ప (25) లాకప్ డెత్ అయ్యాడనే వార్తలు గుప్పుమన్నాయి. వైసీపీ నేతల పంచాయితీ అనంతరం స్థానిక హిందు శ్మశాన వాటికలో అశోక్ మృతదేహాన్ని పూడ్చేందుకు గుంత తవ్వినట్లు తెలిసింది. కానీ రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేయడంతో లాకప్‌డెత్ అనే ప్రచారానికి బలం ఇచ్చినట్టైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు లేకుండా జగన్ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో ఇలాంటి ఘటనలు జరగడమా, అసలు సీఎం జగన్‌కు సిగ్గుందా? అని ఆయన ప్రశ్నించారు. పులివెందుల లాకప్ డెత్‌పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, ఎస్‌ఐ గోపినాథ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి ప్రతిపక్షాలకు పులివెందులలో లాకప్‌డెత్ అంశం ఓ ఆయుధం ఇచ్చినట్టైంది.