పేరుకే ‘‘కొత్తపలుకు’’. పలుకులో ‘కొత్త’దనం లేదు. సిరాలో విషం మాత్రం అదే. ఎవరైనా ఏమైనా అనుకోని ‘నా రోత రాత’ల్లో మార్పు ఉండదని ప్రతివారం ఆంధ్రజ్యోతి ఆర్‌కే కుండబద్దలు కొట్టినట్టు ‘కొత్తపలుకు’ ద్వారా చెబుతున్నాడు. జగన్‌పై ద్వేష భావం రగిలిపోతుంటే మనిషన్న వాడు తట్టుకుని ఎలా ఉండగలుగుతున్నాడో అని ఆర్‌కేను చూస్తే అనుమానం కలుగుతుంది.
ఒకటి, రెండు, మూడు వారాలు కేవలం ఒక రాజకీయ నాయకుని టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా కథనాలు రాయొచ్చు. ఇక నాలుగో వారం కూడా రాయాలంటే అంతరాత్మ అంగీకరించదు. సహజంగా మనిషన్న వాడు, ఆత్మ, అంతరాత్మ ఉన్నవాళ్లు పదేపదే ఒక నాయకుడి రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేయాలని కక్ష కట్టి మరీ రాతలు రాయరు. కానీ ఆర్‌కే ఆ హద్దులన్నీ ఎప్పుడో చెరపేసుకున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం సర్వనాశనమే లక్ష్యంగా పెట్టుకుని అక్షరాలతో వేటాడుతున్నాడు. అందులో భాగంగానే ప్రతి వారం జగన్‌పై విషం చిమ్మడం.
ఈ వారం ఆయన ‘ఆంధ్రుడా మేలుకో!’ అనే శీర్షికతో రాసిన కథనంలో యధాప్రకారం జగన్‌పై విషం చిమ్మాడు.
‘‘2014లో తాను అధికారంలోకి రాకుండా ఓడించిన ప్రజలపై కూడా జగన్మోహన్‌రెడ్డిలో అంతర్లీనంగా కోపం ఉందేమో తెలియదు గానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే కావొచ్చును అన్న అభిప్రాయం కలుగుతోంది. కాబట్టి ఆంధ్రుడా మేలుకో! ఇప్పటికైనా మేలుకో!!’’ ….ఇది ఆయన విశ్లేషణ. 2014లో ఓడించిన ప్రజలపై జగన్‌మోహన్‌రెడ్డిలో అంతర్లీనంగా కోపం ఉండొచ్చేమో తెలియదంటూనే, మరోవైపు కావచ్చేమో అంటూ సన్నాయి నొక్కులు. ఇదేనా ఆంధ్రులను మేల్కొలిపే పద్ధతి.
ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు ఇదే ఆంధ్రజ్యోతిలో ఆర్‌కే ఏప్రిల్ 7న ‘కొత్తపలుకు’లో ‘విజ్ఞతతో ఓటేయండి…ఏపీని గెలిపించండి’ అని ఓటు ఎవరికి వేయాలో, ఎందుకు వేయాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాధాకృష్ణ చక్కటి కథనం రాశాడు. ఆ కథనంలో ‘ముఖ్యమంత్రి కావడం నా కల అని చెప్పుకొనే జగన్‌మోహన్‌రెడ్డి కోర్కె తీర్చడం ముఖ్యమా? బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించడం ముఖ్యమా? అని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నిర్ణయించుకోవాలి’ అని తేల్చి చెప్పాడు. ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి తాను సూచించిన వారికి కాకుండా జగన్‌కు ఓటు వేశారనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఆర్‌కే కక్ష కట్టాడని అర్థం చేసుకోవాల్సి వస్తుంది.
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ నిద్రపోవడం లేదు…ఆర్‌కే చెప్పినట్టు మేల్కోడానికి. గత ఐదేళ్లు ఆర్‌కేనే నిద్రపోయి…తన ఆరాధకుడు చంద్రబాబు అప్రజాస్వామిక పాలన సాగించినా ఒక్క వాక్యం కూడా ఏనాడూ రాయని విషయాన్ని ప్రజలు గుర్తించారు. సమయం చూసుకుని తగిన వాత పెట్టారని ఆర్‌కే గుర్తించి మేల్కోవడం మంచిది.
‘మూడు రాజధానుల నిర్ణయంపై ఇంటా–బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ జగన్ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. జరుగుతున్న అనర్థం కళ్లెదుట కనిపిస్తున్నా.. ‘‘జగన్మోహన్‌రెడ్డి వంటి డైనమిక్ లీడర్లను చూడలేదు’’ అని ప్రశంసించేవారు కూడా ఉండటం విశేషం!’
ఇంటా-బయటా ఎవరు విమర్శలు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో విజ్ఞులైన ప్రజలకు బాగా తెలుసు. అంతేకాదు ఆర్‌కే, రామోజీలా చంద్రబాబుకు మాత్రమే అందరూ భజన చేయాలా?
‘‘గత ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోవాల్సింది కాదు. కానీ నేను నా వ్యూహంతో ఎన్నికల వాతావరణాన్ని జగన్‌కు అనుకూలంగా మలిచాను. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతంగా చేయడంతోపాటు చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాలలో ద్వేష భావాన్ని వ్యాపింపజేయడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. జగన్మోహన్‌రెడ్డి పాలన ఇలా ఉంటుందని అనుకోలేదు. నేను చంద్రబాబుకే కాదు,ఆంధ్రప్రదేశ్‌కు కూడా అన్యాయం చేశాను’’ అని ప్రశాంత్‌కిశోర్ ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారట.
అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది. అయితే చంద్రబాబును ఓడించింది ఆ ప్రశాంత్ కిశోర్ అన్నమాట. అయినా రామోజీరావు ఈనాడులో, మీరు (ఆర్‌కే) ప్రతిరోజూ పనిగట్టుకుని జగన్‌పై చేసిన విష ప్రచారం కంటే….తెలుగే రాని ప్రశాంత్ కిశోర్ చెప్పిన మాటలను జనం ఎందుకు నమ్మారబ్బా? చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాల్లో ద్వేష భావాన్ని ప్రశాంత్‌కిశోర్ వ్యాప్తి చేశాడా లేక మీ రాతల వల్ల కలిగిందా? మరి రాతల వల్లే చంద్రబాబు ఓడిపోయారని టీడీపీ శ్రేణులే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. మరి మీలో ఏనాడైనా పశ్చాత్తాపం కలిగిందా?
ప్రస్తుతం చైనాతో పాటు మరికొన్ని దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఆ వైరస్ దెబ్బకు మృత్యువాత కూడా పడ్డారు. ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిందని ఆందోళన చెందుతున్నారు. కానీ గత కొన్నేళ్లుగా రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఆంధ్రప్రదేశ్ పాలిట కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా తయారయ్యారు. తమకిష్టమైన నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా, ఇతరులుంటే అందుకు పూర్తి విరుద్ధంగా రాతలు రాస్తూ కుల, మత, ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకై దాదాపు నెలన్నర రోజులుగా వీరి పత్రికలు, చానళ్లలో ప్రసారమవుతున్న కథనాలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనవంటే అతిశయోక్తి కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, చానళ్లు వ్యాప్తి చేస్తున్న వైరస్‌ను చావు దెబ్బ తీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది.