భారత సైన్యానికి చెందిన ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో తీవ్ర ప్రమాదానికి గురైంది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నట్టు సమాచారం. మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు మాత్రమే బతికి బయట పడ్డట్టు తెలిసింది.
తమిళనాడులోని కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ప్రమాదం చోటుచేసుకుంది. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్ కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలినట్లు సమాచారం. మంటల్లో హెలికాప్టర్ దహనం కావడాన్ని స్థానికులు వీడియోలు తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం 14 మంది ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ముగ్గురిని స్థానికులు మంటల్లో నుంచి రక్షించినట్టు సమాచారం.
ఆర్మీ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టారు. ఇదిలా వుండగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ పరిస్థితి ఏంటనేది ఇంకా వెల్లడి కాలేదు. ఆర్మీ అధికారులు నోరు తెరిస్తే తప్ప పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు లేవు.