మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాల సమయంలో ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ అక్కడ ప్రత్యక్షం కావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఒక మాజీ ఐఏఎస్ పై సీఐడీ సోదాల సమయంలో.. తెలుగుదేశం నేతలు, తెలుగుదేశం పార్టీకి అనునిత్యం జాకీలు వేయడమే పనిగా పెట్టుకున్న పత్రిక అధిపతి అక్కడ ఉండటంతో.. మొత్తం వ్యవహారం రాజకీయ రంగును పులుముకుంది.
లక్ష్మినారాయణ ఇంటిపై సీబీఐ సోదాలు అనగానే.. తెలుగుదేశం బ్యాచ్ ఇలా రెచ్చిపోయే సరికి, ఆ పార్టీ గట్టిగానే ఉలికిపడుతోందని సామాన్య ప్రజానీకం కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు.
గతంలో జగన్ కేసుల్లో సీబీఐ అధికారులు పలువురు ఐఏఎస్ లను ప్రశ్నించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలెవ్వరూ అక్కడకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు ఏవీ చేయలేదు. అయితే టీడీపీ ఈ సారి గట్టిగా ఉలిక్కి పడుతూ ఉంది. వాస్తవానికి ఏ అరెస్టు జరిగినా.. తాము 48 గంటల్లో బెయిల్ తెచ్చుకుంటామని టీడీపీ వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉండనే ఉంది!
అరెస్టు అంటే డైరెక్టుగా హాస్పిటల్ కు, బెయిల్ అనగానే అటు నుంచి అటే ఇంటికి.. ఇదీ టీడీపీ నేతల కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ ను వాళ్లే బయటకు చాటుకుంటున్నారు. కోర్టుకెళ్లి 24 గంటల్లో స్టే తెస్తా అంటూ.. ఇటీవలే తెలుగుదేశం ఆశాకిరణం లోకేష్ బహిరంగ ప్రకటన చేశారు.
అయినా.. టీడీపీ వాళ్లు ఈ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల కుంభకోణంలో ఉలికిపడుతున్నారు. ఆ సంగతలా ఉంటే.. ఇక పిడకల వేటలా ఈ వ్యవహారంలో తలదూర్చిన ఏబీఎన్ రాధాకృష్ణ తను అక్కడ ఎందుకు ఉన్నట్టనే అంశం గురించి తనే సాక్ష్యం చేసుకున్నారు. ఈ సారి వీకెండ్ కామెంట్లో అదే హైలెట్.
తను లక్ష్మినారాయణకు ధైర్యం చెప్పడానికి వెళ్లినట్టుగా రాధాకృష్ణ వాంగ్మూలం ఇచ్చుకున్నారు తన పత్రికలో, టీవీలో. తను అక్కడ నుంచి వచ్చేద్దామనుకున్నా… సీఐడీ అధికారులు వెళ్లనివ్వలేదని, తను అక్కడే ఉంటే పని తేలికగా జరుగుతోందని.. అందుకే తను అక్కడ ఉన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.
ఇలా ఏపీ సీఐడీ అధికారులు బతిమాలితేనే అక్కడున్నట్టుగా ఆయన ఒకటికి పది సార్లు చెప్పుకున్నారు తన వీకెంట్ కామెంట్లో. మరి పిల్లికి పిల్లే సాక్ష్యం అవుతుందా? తామే రాధాకృష్ణను అక్కడ ఉండమన్నట్టుగా సీఐడీ అధికారుల చేతే ఒక మాట చెప్పిస్తే పోతుంది కదా! అంతేగాక.. తామే రాధాకృష్ణను అక్కడకు రమ్మన్నట్టుగా కూడా వారి చేతే ఒక మాట చెప్పించేస్తే అయిపోతుంది. అంతేగానీ.. నాకు నేనే సాక్షి అంటే ఎలా రాధాకృష్ణగారూ!