ఇటీవలి కాలంలో బీజేపీ, శివసేనల మధ్యన దూరం తగ్గుతున్న దాఖలాలు కనిపించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశం నుంచి సమీకరణాలు మారినట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి.
ఒకవైపు మహారాష్ట్రలో శివసేన నేతలు లక్ష్యంగా ఈడీ దాడులు జరిగాయి. దీంతో శివసేన ఎమ్మెల్యే ఒకరు బాహాటంగానే వ్యాఖ్యానించారు. తమ అధినేత బీజేపీతో స్నేహంగా ఉంటే తమ బోటి వారికి ఇబ్బంది ఉండని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇటీవలే సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. తమకు బీజేపీతో గొడవల్లేవన్నారు. దానికి ఆమిర్ ఖాన్, కిరణ్ రావులను రౌత్ ఉదాహరించారు. విడాకులు తీసుకున్న భార్యాభర్తలయినప్పటికీ తాము స్నేహితులమేనంటూ వారు ప్రకటించిన విషయాన్ని రౌత్ ప్రస్తావించారు. బీజేపీతో శివసేనకు విడాకులు అయినప్పటికీ.. స్నేహం ఉందన్నట్టుగా మాట్లాడారు.
అయితే ఒక్కో రోజు అలా, మరో రోజు ఇలా అన్నట్టుగా ఉంది వీరి వ్యవహారం. ఉద్ధవ్ కోరుకున్నది రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి మాత్రమేనని, బీజేపీ దాన్ని ఇచ్చి ఉంటే.. శివసేన దూరం అయ్యేది కాదంటూ ఇరువురి శ్రేయోభిలాషులు సన్నాయి నొక్కులు నొక్కారు. బహుశా కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీకాలం ముగియగానే సేన తిరిగి బీజేపీ పంచకు వెళ్లాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో బీజేపీ భక్తులు అస్సలు వెనుకాడే టైపు కాదు.
ఇక మొన్ననే బీజేపీ-శివసేనది ఆమిర్-కిరణ్ రావు టైపు బంధమన్న రౌత్ ఇప్పుడు మరో వ్యాఖ్య చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని పదవికి అర్హుడన్నట్టుగా రౌత్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు మోడీని ఢీ కొట్టడానికి పవార్ కు మించిన ఛాయిస్ లేదన్నట్టుగా కూడా రౌత్ తేల్చి చెప్పాడు.
ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఏర్పడి పవార్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు వెళ్లాలని రౌత్ సూచించారు. మరి ఆ కూటమిలో శివసేన ఉంటుందా? వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ మహా వికాస్ అంఘడీ స్నేహం వర్ధిల్లుతుందా అనేది కూడా అనేక అనుమానాల్లో ఒకటి!