ఢిల్లీలోని నేషనల్ కన్సూమర్ డిస్ఫ్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ సంచలన తీర్పును ఇచ్చింది. అక్కడి ఐటీసీ మౌర్య హోటల్ లోని హెయిర్ కట్ సెలూన్ కు ఏకంగా రెండు కోట్ల రూపాయల ఫైన్ ను విధించింది. ఆ రెండు కోట్ల మొత్తాన్ని అక్కడ హెయిర్ కట్ చేయించుకున్న ఒక మోడల్ కు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆమె పిటిషన్ మేరకు ఈ తీర్పును ఇచ్చింది. ఆమె కోరినట్టుగా కాకుండా మరో రకంగా హెయిర్ కట్ చేయడంపై ఈ తీర్పు రావడం గమనార్హం!
లాంగ్ హెయిర్ కావాలని ఆమె కోరితే, అక్కడి హెయిర్ డ్రస్సర్ కత్తిరించి వేశాడట, కేవలం నాలుగు ఇంచుల పొడవును మాత్రమే వదిలి మొత్తం హెయిర్ కట్ చేసేశాడట. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని ఆమెకు చెల్లించుకోవాల్సి వస్తోంది ఈ సెలూన్ వారు.
హెయిర్ డ్రస్సర్ చేసిన పొరపాటుతో తనకు చాలా నష్టం కలిగిందని, తనకు చేతిలో ఉన్న ఆఫర్లు పోయాయని, అలాగే మానసిక క్షోభను అనుభవించినట్టుగా ఆ మోడల్ కమిషన్ కు చెప్పుకుంది. ఆమె వాదనతో ఏకీభవించిన కమిషన్ సెలూన్ నిర్వాహకులకు షాకిచ్చింది. మహిళలకు తమ హెయిర్ తో చాలా భావోద్వేగపూరితమైన బంధం ఉంటుందని, సెలూన్ వారు చేసిన పొరపాటుతో ఆమె కెరీర్ కూడా కొంత దెబ్బతిందని, అందుకు పరిహారంగా ఆమెకు రెండు కోట్ల రూపాయలను చెల్లించాలని తీర్పును ఇచ్చింది.
అలాగే అదే సెలూన్ వారు ఆమెకు ఒక స్కాల్ప్ ట్రీట్మెంట్ ను కూడా అప్పుడు ఆఫర్ చేశారట. అది కూడా వికటించినట్టుగా తెలుస్తోంది. అటు తన లాంగ్ హెయిర్ ను అమాంతం కట్ చేసి పడేసి, స్కాల్ప్ ట్రీట్ మెంట్ కూడా తేడా కొట్టడంతో ఆమె చాలా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదునంతా వినియోదారుల వివాదాల కమిషన్ కు తెలియజేయగా.. ఆమెకు పూర్తి బాసటగా నిలిచింది కమిషన్.
రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని ఆమెకు చెల్లించాలని స్పష్టం చేసింది. కన్సూమర్ డిస్ప్యూట్స్ కు సంబంధించి విదేశాల్లో ఇలాంటి తీర్పులు వచ్చేవి. ఇండియాలో వినియోగదారులంటే అమ్మే వారికి చులకన. ఇలాంటి వివాదాల్లో పెద్ద పెద్ద సంస్థలను ఢీ కొనాలంటే మాటలేమీ కాదు. వాళ్ల లాబీయింగ్ కు వినియోగదారులు చిత్తవుతారు. అయినా ఆ మోడల్ ఎవరో గట్టిగా పోరాడి సాధించుకున్నట్టుగా ఉంది.