ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సంహరణకు ఎట్టకేలకు టీకా తయారైంది! ఈ టీకాను రష్యా తయారు చేసింది. ఈ టీకాను రేపు (ఆగస్టు 12) విడుదల చేయనున్నట్టు రష్యా ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అయితే రష్యా తయారు చేసిన కోవిడ్ టీకాపై అనేక అనుమానాలున్నప్పటికీ, మరోవైపు ప్రపంచం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తోంది. అసలే ఏమీ లేని దానికంటే…ఏదో ఒకటి ఉందనే ధైర్యం, భరోసా కావాలని ప్రపంచ ప్రజానీకం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో రష్యా ప్రకటన సాంత్వన ఇచ్చేలా ఉంది.
తమ దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ టీకాను అందించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నట్టు రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. రష్యాలోని గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ టీకా తయారు చేశాయి. గత కొంత కాలంగా తమ దేశం కోవిడ్ టీకాను ప్రపంచానికి అందిస్తుందని రష్యా గర్వంగా చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ దశల్లో ప్రయోగాలు పూర్తయ్యాయని, అన్ని స్థాయిల్లో సక్సెస్ అయిందని ఆ దేశం ప్రకటించడమే కాదు….ఆగస్టు 12 నాటికి ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లోకి తెస్తామని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో టీకా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. టీకా వేసుకున్న తర్వాత 21వ రోజుకు వైరస్‌ను అడ్డుకునేలా రోగనిరోధక వ్యవస్థ బాగా పెరిగిందని తేలింది. అంతేకాదు, రెండో డోస్‌తో ఇది రెట్టింపు సామర్థ్యం పెంపొందించుకుని వైరస్‌ను తుది ముట్టించిందని సమాచారం. ఈ టీకాను అడినోవైరస్ భాగాలతో చేసినట్లుగా మీడియా వెల్లడించింది.
ఒక వైపు రష్యా టీకాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన కలిగించడం గమనార్హం. సురక్షితమైన, సమర్థనీయమైన టీకా తయారీకి తమ మార్గదర్శకాలను పాటించాలని రష్యాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన కరోనా టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంధోనీ పాసీ స్పందిస్తూ చైనా, రష్యా అందరికీ వ్యాక్సిన్ అందించే ముందు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా వచ్చే నెలలో వ్యాపార పరంగా టీకాను ఉత్పత్తి చేస్తామని రష్యా పేర్కొంది. ముందుగా తక్షణ అవసరం కింద వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు టీకా ఇస్తామని పేర్కొంది. నవంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా అందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీకాను ఉత్పత్తి చేస్తామని రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది. రష్యా రేపు విడుదల చేసే టీకా…ఎంత మాత్రం పనిచేస్తుందో రోజుల్లోనే తెలిసిపోతుంది. రష్యా టీకాకు కరోనా వైరస్ చచ్చిపోతుందంటే అంతకంటే కావాల్సిందేముంది?