సజ్జల రామకృష్ణారెడ్డి… వైసీపీ ప్రభుత్వంలో కీలక నేత. వృత్తి రీత్యా జర్నలిస్టు అయిన సజ్జల మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి ఆప్తుడు. వామపక్ష భావజాలంతో పెరిగిన నేత. విద్యార్థి దశలో సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్‌లో అన్న దివాకర్‌రెడ్డితో కలిసి పని చేసిన అనుభవం. సాక్షి దినపత్రిక ప్రారంభంలో కర్త, కర్మ, క్రియ…అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డే. సాక్షి దినపత్రికకు ఎడిటోరియల్ డైరెక్టర్‌గా …ఆ మీడియా సంస్థను విజయపథంలో నడిపించారు.
అనంతర కాలంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన సాక్షి మీడియా గ్రూప్ నుంచి తప్పుకున్నారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పని చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అందులో ముఖ్య సలహాదారుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ప్రభుత్వ సలహాదారు బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సలహాదారు పదవి రాత్రికి రాత్రే ఎటూ వెళ్లిపోయింది.
ఏపీ ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో సలహాదారులున్నారని, అలాగే వారు రాజకీయాలు మాట్లాడ్డం ఏంటని హైకోర్టు ప్రశ్నించిన తర్వాత 24 గంటల్లో సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవి కనిపించక పోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఆయ న్ను సలహాదారు పదవి నుంచి తప్పించింది జగన్ ప్రభుత్వం మాత్రం కాదులెండి. తాను ఏదైతే మొట్ట మొదటి ఎడిటోరియల్ డైరెక్టర్‌గా సేవలందించారో… ఆ సాక్షి పత్రికే ఆయనకు పదవి పోగొట్టింది. అదెలాగో చూద్దాం.
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, ప్రతిపక్షాల విమర్శలు…ఇలా ఏవైనా కావచ్చు, వాటికి కౌంటర్లు ఇవ్వడానికి ప్రతిరోజూ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు రావడం చూస్తున్నాం. విశాఖ ఉక్కు కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారని, అందుకు వైసీపీ సిద్ధమా? అని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరిన నేపథ్యంలో, దీటుగా కౌంటర్ ఇవ్వడానికి శనివారం సజ్జల మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు సవాల్‌ను ఆయన ఎద్దేవా చేశారు.
సహజంగా సజ్జల ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వార్తలో ప్రధానంగా ప్రభుత్వ సలహాదారు హోదాతో సాక్షి లేదా ఇతర మీడియా సంస్థలు హైలైట్ చేస్తుంటాయి. కానీ ఆదివారం సాక్షిలో ప్రచురించిన వార్తలో గతానికి భిన్నంగా సజ్జల ప్రభుత్వ హోదాను కాదని పార్టీ పదవిని మాత్రమే ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
“అన్నింటికి రాజీనామాలా? ఈ సవాళ్లేంటి?” అనే శీర్షికతో ఆదివారం సాక్షిలో సజ్జల ప్రెస్‌మీట్ వార్తను ప్రచురించారు. ఈ వార్తకు సంబంధించి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ సబ్ హెడ్డింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఇక వార్తలోకి వెళితే…వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సజ్జల రామకృష్ణారెడ్డిని హైలైట్ చేయడాన్ని గమనించొచ్చు. సలహాదారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి పదవిని సాక్షి తొలగించిందనే విషయమం స్పష్టమవుతోంది.
ఇదే సాక్షి దినపత్రిలో అంతకు ముందు ప్రభుత్వ సలహాదారు హోదాను ఇస్తూ వస్తోంది. మచ్చుకు వరుసగా రెండు రోజుల్లో సజ్జలకు సంబంధించిన వార్తలను పరిశీలిద్దాం. సాక్షిలో శుక్రవారం ప్రచురించిన వార్త ఏంటో తెలుసుకుందాం. “అట్టడుగు వారికీ ఫలాలు” శీర్షికతో వార్త ప్రచురించారు. రెండుమూడు సబ్ హెడ్డింగ్స్‌లో ఒకటిగా సజ్జలను చేర్చారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని స్పష్టంగా ఇచ్చారు. వార్తలోకి వెళితే… ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) అని సజ్జల హోదాను పొందుపరిచారు. ఇక్కడ పార్టీ పదవి ఊసే లేదు.
అలాగే శనివారం ప్రచురించిన మరో వార్తను చూద్దాం. “ప్రజలకు చంద్రబాబే పెద్ద సమస్య” అనే శీర్షికతో వార్త ఇచ్చారు. సబ్ హెడ్డింగ్‌లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని పేర్కొన్నారు. ఈ శీర్షికకు సంబంధించిన వార్తలోకి వెళితే… మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించడం మానేసి ప్రజలకు పెద్ద సమస్యగా మారారని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారంటూ రాసు కొచ్చారు.
ఇక్కడ ప్రభుత్వ పదవితో పాటు పార్టీ పదవిని కూడా చేర్చి రాయడాన్ని గుర్తించొచ్చు. సలహాదారులు రాజకీయాలు మాట్లాడ్డంపై హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో … తాజాగా సాక్షి మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కేవలం పార్టీ పదవిని మాత్రమే రాయడం విశేషం. తద్వారా న్యాయస్థానం కామెంట్స్ సరైనవే అని జగన్ పత్రిక చెప్పకనే చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.