రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదేపదే ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఓ ప్రశ్నతో విసిగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. పార్టీ స్థాపించి ఆరేళ్లవుతున్నా కనీసం గ్రామస్థాయి కమిటీ కూడా వేయని జనసేన కూడా పంచాయతీ ఎన్నికల్లో తమదే రెండో స్థానమని చెప్పుకోవడం గమనార్హం.
నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. విడతవిడతకూ మెరుగైన ఫలితాలను తమ పార్టీ మద్దతుదారులు సాధించారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి నుంచి ప్రధాన ప్రతిపక్షానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసురుతున్నారు.
తాజాగా మరోసారి ఆయన ట్విటర్ వేదికగా టీడీపీకి సజ్జల సవాల్ విసిరారు.
“ఇంకా ఎందుకు అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు చేస్తారు. పంచాయతీల్లో మా మద్దతుదారులు ఎక్కడెక్కడ గెలిచారో వారి ఫొటోలతో సహా వెబ్సైట్లో పెట్టాం. మీ వాళ్లు ఎక్కడ గెలిచారో వారి ఫొటోలతో సహా జాబితాను విడుదల చేయగలరా?” అని ప్రతిపక్ష నేత చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
నాలుగు విడతల్లో తెదేపా మద్దతుదారులు 4,230 స్థానాల్లో గెలిచారని చంద్రబాబు లెక్కలు చెప్పారు. కానీ సజ్జల డిమాండ్ చేస్తున్నట్టు విజేతల ఫొటోలు, వివరాలతో జాబితాను మాత్రం ప్రకటించే దమ్ము చంద్రబాబుకు ఎందుకు లేదో అర్థం కాదు.
మరోవైపు వైసీపీ మద్దతుదారుల వివరాలు స్పష్టంగా వెబ్సైట్లో ఇవ్వడం గమనార్హం. సజ్జల సంధిస్తున్న ప్రశ్న చంద్రబాబును ఇరిటేట్ చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.