తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు క్వీన్ మేకర్ శశికళ రేపే విడుదల కానున్నారా? ఈ మేరకు ఆమె అనుచరవర్గాలు ఆమె విడుదల నేపథ్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
శశికళ వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో విడుదల అయ్యే అవకాశం ఉందని మొదట్లో వార్తలు వచ్చాయి. వాటి ప్రకారం ఇంకా ఆమె రెండు నెలల పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. అయితే.. రెమిసన్ డేస్ ను కలుపుకుంటే శశికళ విడుదలకు ఇప్పటికిప్పుడే అవకాశం ఉందట!
ఆమెకు 129 రోజుల రెమిసన్ పిరియడ్ ఉందట. ఈ నేపథ్యంలో ఆమె ఏ క్షణమైన విడుదల కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అన్ని కుదిరితే శశికళ శనివారమే విడుదల కాబోతోందని సమాచారం. ఇక జైలు నుంచి ఎప్పుడు విడుదల కావాలనేది శశికళ ఇష్టమే అని టాక్!
జైల్లో శశికళ సత్ప్రవర్తన కింద ముందస్తు విడుదలకు అవకాశం పొందుతోందని సమాచారం. కన్నడ నేర్చుకోవడం, కంప్యూటర్ నేర్చుకోవడంతో కర్ణాటక జైళ్ల శాఖ నియమాల ప్రకారం.. ఆమెకు కొన్ని రోజుల శిక్ష తగ్గుతోందని తెలుస్తోంది.
ఇప్పటికే శశికళ తను కట్టాల్సిన పది కోట్ల రూపాయల ఫైన్ మొత్తాన్ని కూడా కట్టేసినట్టుగా వార్తలు వచ్చాయి. డీడీ రూపంలో చెల్లింపులు జరగడంతో.. శశికళ అతి త్వరలోనే విడుదల కానుందనే వార్తలకు మరింత ఊపు వస్తోంది.