మళ్లీ కోవిడ్ భయాలు అలుముకుంటున్నాయి. వేరే దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయనే వార్తలు ఇండియాలో కూడా ఆందోళనలు రేపుతున్నాయి. ఎక్కడో కేసులు పెరుగుతున్నాయి, ఇక్కడ కాదు కదా.. అనే భావన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేదు! ఏ దేశంలో కరోనా కేసులు పెరిగినా.. మిగతా ప్రపంచం కూడా ఆ పరిణామంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
సౌత్ కొరియాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో… ఎక్కడిక్కడ పరిస్థితి గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో నాలుగో వేవ్ గురించి పరిశోధకులు స్పందిస్తున్నారు. ముందుగా వారు చెప్పే మాట ఏమిటంటే… ఇండియాలో నాలుగో వేవ్ ఎప్పుడు, ఎలా మొదలవుతుందనేది కచ్చితంగా ప్రస్తుతానికి చెప్పలేమనేది.
మూడో వేవ్ కరోనా ఇండియాలో ఇప్పటికే సద్దుమణిగింది. నాలుగో వేవ్ గురించి అధ్యయనాలు, పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న స్థితిలో నాలుగో వేవ్ ఆరంభం, అంతాల గురించి అధ్యయనకర్తలు కచ్చితంగా అంచనాలను వేయడం లేదు.
అయితే వారు చెప్పే పాజిటివ్ అంశం ఏమిటంటే.. మూడో వేవ్ వల్ల భారతీయుల్లో కరోనాను ఎదుర్కొన ఇమ్యూనిటీ మరింత మెరుగయ్యిందనేది. మూడో వేవ్ లో ఇండియాలో భారీ సంఖ్యలోనే కేసులు వచ్చాయి. అయితే తక్కువ వ్యవధిలోనే.. ఆ వేవ్ రైజ్ అయ్యి, తగ్గుముఖం పట్టింది. చాలా మందికి కరోనా సోకినా.. ఈ వేవ్ లో త్వరగా కోలుకున్నారు. కొందరికి అయితే అప్పటికే ఉన్న ఇమ్యూనిటీ వల్ల సోకినా.. ఎలాంటి సింప్టమ్స్ బయటపడలేదు.
ఒమిక్రాన్ రూపంలో కరోనా స్వల్ప స్థాయి ప్రభావాలతో సోకడం వల్ల చాలా మందిలో కరోనాను ఎదుర్కొనగల ఇమ్యూనిటీ లెవల్స్ మెరుగయ్యాయని అధ్యయన కర్తలు చెబుతున్నారు. అలాగే వ్యాక్సినేషన్ కూడా భారీ ఎత్తున జరగడం కూడా సానుకూలమైన అంశమని అంటున్నారు. ఈ అంశాలు నాలుగో వేవ్ పై ప్రభావాన్ని చూపేవే అని, వీటి ఆధారంగా కొంత వరకూ నాలుగో వేవ్ విషయంలో ధీమాగా ఉండవచ్చంటున్నారు.