ఎన్నడూ లేని రీతిలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కంచుకోటల్లో జయకేతనం ఎగరేసింది. వాటిల్లో అనంతపురం జిల్లాలోని పెనుకొండ, రాప్తాడు వంటి నియోజకవర్గాలున్నాయి. దశాబ్దాలుగా టీడీపీకి పెట్టని కోటగా నిలిచిన ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీలతో నెగ్గింది. అందుకు ప్రధాన కారణం.. బీసీ ఓటర్ తీరులో మార్పే అనే విశ్లేషణ ప్రముఖంగా వినిపించింది.
ఎన్టీఆర్ పార్టీని పెట్టిన దగ్గర నుంచి రాయలసీమలో బీసీ ఓటర్ రుణపడినట్టుగా టీడీపీకి ఓటేస్తూ వచ్చాడు. సినీమానియాతో ఎన్టీఆర్ చేసిన మాయ, కాంగ్రెస్ రాజకీయాలు అగ్రకులాలనే అంటి పెట్టుకుని ఉండటం.. వంటి కారణాలతో అప్పట్లో బీసీ సామాజికవర్గాలు జై తెలుగుదేశం అన్నాయి. దశాబ్దాలకు దశాబ్దాలు గడిచాయి కానీ.. ఆ వర్గాలు అలాగే జై తెలుగుదేశం అంటూనే వచ్చాయి!
ఎన్టీఆర్ పోయి చంద్రబాబు తెరపైకి వచ్చి దశాబ్దాలు గడిచినా అదే కథ రిపీట్ అయ్యింది. అయితే వాళ్లకు చంద్రబాబు ఇచ్చింది షేవింగ్ కిట్లు, వెంట్రుకలు కత్తరించే కత్తెర్లు, చాకలి బట్టలను మోసుకెళ్లేందుకు సైకిళ్లు…. ఇవి! ఆదరణ పేరుతో.. చంద్రబాబు నాయుడు కులవృత్తుల ఉపకరణాలను ఇవ్వడం గత మూడు దశాబ్దాల్లో చోటు చేసుకున్నపెద్ద పరిమాణం! ఇంతకు మించి టీడీపీ హయాంలో, ప్రత్యేకించి చంద్రబాబు సీఎంగా వ్యవహరించిన 14 యేళ్లలో సీమ బీసీలకు దక్కింది ఏమీ లేదు!
వైఎస్ఆర్ తెచ్చిన ఫీజురీయింబర్స్ మెంట్ తో బీసీలు ఉచితంగా పెద్ద చదువులు చదువుకోగలిగారు, ఆరోగ్య శ్రీతో ఈ వర్గాలు ధీమాను పొందాయి. చంద్రబాబు మాత్రం..వారికి కత్తెర్లు, బ్లేడ్లు పంచి పెట్టి.. అదే బీసీ వర్గాలను ఉద్ధరించడం అని చెప్పుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు మళ్లీ ఆదరణ పథకాన్నే ప్రవేశ పెట్టారనే విషయం మరిచిపోయే అంశం కాదు బీసీ వర్గాలు!
బీసీలకు రాజకీయంగా ఇచ్చిన ఊతం కూడా ఏమీ లేదు. బీసీల జనాభా అత్యధికంగా ఉన్న అనంతపురం జిల్లాలో ఐదు మంది కమ్మ ఎమ్మెల్యేలు తేలారు గత పర్యాయంలో. అంత చేస్తే అనంతపురం జిల్లాలో కమ్మ జనాభా రెండు మూడు శాతం దాటదు! అలా ఓట్లు బీసీలవి, సీట్లు కమ్మోళ్లవి అన్నట్టుగా నడిచిన కథకు గత ఎన్నికలతో బ్రేక్ పడింది. టీడీపీ… బీసీలు.. అంటే, కాలువ శ్రీనివాసులు, పార్థసారథి.. ఆదరణ పథకం అన్నట్టుగా దశాబ్దాల పాటు కథ నడిచింది. 2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది.
మరి అంత జరిగిన తర్వాత అయినా టీడీపీ వ్యవహారంలో మార్పు ఏమైనా ఉందా? అంటే.. అలాంటిదేమీ లేదు. అదే కాలువ, అదే పార్థ.. అదే కథ. అందుకే మరోసారి టీడీపీకి భంగపాటు తప్పలేదు. పెనుకొండ మేజర్ పంచాయతీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఒకప్పటి ఈ కంచుకోటలో టీడీపీ రెండు వార్డుల్లో ఉనికిని నిలుపుకుంది.
కేవలం పెనుకొండ అనే కాదు.. హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ ఫలితంలోనూ ఇది వరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని స్థానిక ఎన్నికల ఫలితాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిరగడం కేవలం గాలివాటం కాదు అని స్థానిక ఎన్నికల ఫలితాలు క్లారిటీ ఇస్తున్నాయి.
స్థానిక ఎన్నికల ఫలితాలు సాధారణంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయంటూ టీడీపీ అభిమానులు సన్నాయి నొక్కులు నొక్కవచ్చు కానీ, తమ సంప్రదాయ ఓటు బ్యాంకు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గిందో టీడీపీ తేల్చుకోవాల్సి ఉంది. సంప్రదాయ ఓటు బ్యాంకుకు.. అధికారంతో పని లేదు. అది కేవలం అభిమానంతో పడేది. అదే ఇప్పుడు లేకుండా పోయిందని టీడీపీ గుర్తించడం లేదు.
ఏవో సాకులు చెప్పి, సన్నాయి నొక్కులు నొక్కి.. మీడియా మేనేజ్ మెంట్ తోనే పబ్బం గడుపుకోవాలని టీడీపీ ఇప్పటికీ భావిస్తున్నట్టుగా ఉంది. మరి దీని వల్ల నష్టం ఎవరికో వేరే చెప్పనక్కర్లేదు. టీడీపీ సంగతలా ఉంటే.. స్థానిక ఎన్నికల ఫలితాలు మాత్రం నిస్సందేహంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీమాను అందించాయి.