కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఒక్కో రాష్ట్రాన్నీ తన హస్తగతం చేసుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇటు రాష్ట్రాల్లోనూ, అటు కేంద్రంలో పట్టు కోల్పోతోంది. భవిష్యత్ పై నమ్మకం పూర్తిగా కోల్పోతున్న వేళ.. కాంగ్రెస్ కి పూర్తిస్థాయి నాయకత్వం అవసరం ఉంది.
అయితే యువరాజు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చేపట్టేందుకు వెనకాడుతున్నారు, ఇటు సోనియాగాంధీ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ముందుకెలా వెళ్లాలి, కాంగ్రెస్ ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలపై అంతర్మథనం జరగబోతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేపు సీడబ్ల్యూసీ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రాసిన ఓ లేఖ వెలుగులోకి వచ్చింది.
సోనియాగాంధీని ఉద్దేశిస్తూ కాస్త ఘాటుగానే ఈ లేఖ రాశారు. గాంధీ కుటుంబం పట్ల విధేయత చూపుతూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వారు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. ఈ లేఖను సదరు నేతలు 15 రోజుల క్రితమే రాసినట్టు ప్రచారం జరిగినా.. సీడబ్ల్యూసీ సమావేశానికి ఒకరోజు ముందే ఇది వెలుగులోకి రావడం విశేషం. సోనియాకు రాసిన లేఖలో సంతకాలు చేసిన 23మంది ప్రముఖుల్లో గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, భూపేందర్ సింగ్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, శశిధరూర్, జితిన్ ప్రసాద్ వంటి సీనియర్ నాయకులున్నారు.
కాంగ్రెస్ పార్టీని కింది నుంచి పైస్థాయి వరకు ప్రక్షాళన చేయాలని లేఖలో నేతలు అధినేత్రిని కోరారు. పార్టీకి పూర్తికాలం అధ్యక్షుడిని నియమించాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ లాగా అధ్యక్ష పదవితో దోబూచులాడేవారు వద్దని, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి జవసత్వాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని పరోక్షంగా బహిర్గతం చేశారు. దూరదృష్టి, క్రియాశీలత ఉన్న నాయకత్వం చేతిలో పార్టీని ఉంచాలని సీనియర్లు స్పష్టం చేశారు.
ఇప్పటికే పార్టీలో నైరాశ్యం నెలకొని ఉందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పెరగడం కంటే.. కాంగ్రెస్ బలం తగ్గిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది కానీ, పిల్లిమెడలో గంటకట్టేవారెవరనే విషయంపైనే సందిగ్ధత నెలకొని ఉంది.
రాహుల్ గాంధీ తనకి పెత్తనం వద్దంటారు, ఒకవేళ ఇచ్చినా ఆయన నేతృత్వంలో పార్టీ ఎదగలేదనే విషయం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలుసు. ప్రియాంక గాంధీ పనితనం కూడా గత ఎన్నికల్లో తేలిపోయింది. సోనియా గాంధీ ఆరోగ్య రీత్యా ఆమె పార్టీ వ్యవహారాల నుంచి తప్పుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి గాంధీ కుటుంబం కాకుండా.. పార్టీని ఏకతాటిపై నడిపే నాయకుడు ఎవరు? అధ్యక్ష ఎన్నికలు జరిపితే అందరూ ఒకేమాటపై నిలుస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.
సీనియర్ల లేఖ దుమారం రేపుతున్న వేళ, సీడబ్ల్యూసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.