ఛీటింగ్ లో కూడా స్టేటస్ మెయింటైన్ చేసింది శిల్ప చౌదరి. కిట్టీ పార్టీల ముసుగులో కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ కి'లేడీ'.. ఎంత పడితే అంత తీసుకునేది కాదంట. మోసానికి కూడా మినిమం ఎమౌంట్ ఫిక్స్ చేసింది. కోటి రూపాయలకు తగ్గితే తీసుకునేది కాదంట.
పెట్టుబడులు పెడతానని, అధిక వడ్డీలు ఇప్పిస్తానని, బ్లాక్ ఎమౌంట్ ను వైట్ చేస్తానంటూ పలువురు ప్రముఖుల్ని నమ్మించి, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈవిడ.. మరోసారి పోలీస్ కస్టడీలో ఉంది. ఈ క్రమంలో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
కోర్టు ఇప్పటికే ఓసారి శిల్పాను పోలీస్ కస్టడీకి అనుమతించింది. అయితే అప్పట్లో ఆమె నుంచి ఎలాంటి వివరాలు రాబట్టలేకపోయారు పోలీసులు. మరోసారి కస్టడీ కోసం కోరారు. దీంతో మరోసారి శిల్ప చౌదరిని పోలీస్ కస్టడీకి అప్పగించింది కోర్టు.
అయితే తొలిసారి కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఏ వివరాలైతే చెప్పిందో, దాదాపు అవే వివరాల్ని రెండోసారి కస్టడీలో కూడా చెబుతోందట శిల్ప. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే.. తొలిసారి కస్టడీలో ఆమె ఏడవడం, కళ్లు తిరిగి పడిపోవడం లాంటివి చేసింది. ఈసారి మాత్రం అలాంటివేం లేవు. పొడిపొడిగా మాత్రమే సమాధానాలిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో వ్యక్తి నుంచి కోటి కంటే తక్కువ ఎమౌంట్ ను తను తీసుకోలేదని శిల్ప చౌదరి చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రముఖుల నుంచి వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని వివిధ వ్యక్తుల వద్ద పెట్టుబడులుగా పెట్టానని చెబుతున్న శిల్పాచౌదరి, వాళ్ల పేర్లు మాత్రం చెప్పడం లేదు. అందరికీ వడ్డీతో సహా డబ్బులిస్తానని, తను మోసం చేయలేదని చెప్పినమాటలే పదేపదే చెబుతోంది. తీసుకున్న డబ్బు ఎక్కడ పెట్టిందనే విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. మరోవైపు గండిపేట్ లో ఉన్న సిగ్నేచర్ విల్లాస్ లో శిల్ప చౌదరి నివాసాన్ని పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ కూడా వాళ్లకేం దొరకలేదు.
మరోవైపు శిల్పా చౌదరిపై కేసులు పెడుతున్న ప్రముఖల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే సెహరి సినిమా హీరో, మరో హీరో సుధీర్ బాబు భార్య, ఓ ఐఏఎస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా.. తాజాగా మరింత మంది ప్రముఖులు ఈ జాబితాలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా నార్సింగి పోలీస్ స్టేషన్ సెలబ్రిటీలతో కిటకిటలాడుతోంది.
ఈరోజు కూడా శిల్పను ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇప్పటికే ఆమె కొంతమంది పేర్లు చెప్పగా, వాళ్లను ప్రశ్నించేందుకు నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.