సిక్కోలు గానం మూగబోయింది

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనకబడిన జిల్లా అయిన శ్రీకాకుళం నుంచి నాలుగున్నర దశాబ్దాల క్రితం ఒక  గానం వినిపించింది. అది సినీ సీమలో ప్రేమ బృందావనమై మోగింది. దూరాన తారా దీపం అంటూ ఆశలు…

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనకబడిన జిల్లా అయిన శ్రీకాకుళం నుంచి నాలుగున్నర దశాబ్దాల క్రితం ఒక  గానం వినిపించింది. అది సినీ సీమలో ప్రేమ బృందావనమై మోగింది. దూరాన తారా దీపం అంటూ ఆశలు రేపింది. ఒక వేణువు వినిపించిన అనురాగ గీతికగా మారింది.

ఆ గొంతు ప్రఖ్యాత గాయకుడు జి ఆనంద్ దైతే అది పలికించిన సరిగమలు విని తరించిన అదృష్టం యావత్తు తెలుగువారిది. మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదులో ఎన్నియ‌ల్లో ఎన్నియల్లో ఎందాకా అంటూ హుషారెత్తించే యుగళ గీతాన్ని ఆలపించిన ఆనంద్ అలా ఎన్నో మంచి పాటలు పాడారు.

ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ భక్తి రసాన్ని ఆవిష్కరించారు. సొంతంగా స్వరమాధురి ఆర్కేస్ట్రా ద్వారా ఆరున్న వేల కచేరీలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. గాంధీ నగర్ రెండవ వీధిలో సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారి రాణించారు. ఎంతోమంది ఔత్సాహీకులకు తన ఆర్కేస్ట్రా ద్వారా అవకాశాలు ఇచ్చి సినీ సీమకు పరిచయం చేశారు.

ఎన్ని చేసినా ఎన్ని చూసినా శ్రీకాకుళం మూలాలను మరచిపోని ఆనంద్ తరచుగా ఆ జిల్లాకు వస్తూంటారు. తన కుటుంబీకులను, బంధు మిత్రులను కలుసుకుని ఇక్కడ సేద తీరుతారు. 

సిక్కోలు కూడా ఆనంద్ ని చూసి మురిసేది. అటువంటి ఆనంద్ ని కూడా కరోనా బలి తీసుకుంది. ఆక్సిజన్ లేక ఆయన మృత్యు కౌగిలిన చేరారు. దీంతో ఆయన పుట్టిన గడ్డ శ్రీకాకుళం తీవ్ర విషాదంలో మునిగింది. ఆయన పాటలను ప్రేమించే అభిమానులూ కలత చెందుతున్నారు.