“బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాం. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా చూస్తాం.” ఇలా రెండు స్టేట్ మెంట్స్ తో ఇటు బీజేపీని, అటు టీడీపీని ఒకేసారి దువ్వే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. ఆయనైతే క్లియర్ గానే ఉన్నారు. రెండు పార్టీల్ని కలుపుకొని ముందుకెళ్లాలనేది పవన్ ఆలోచన. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో దోస్తీకి నై అంటోంది. ఎక్కడ పవన్ వెళ్లి చంద్రబాబుతో చేతులు కలుపుతారా అనే భయం ఏపీ బీజేపీకి పట్టుకుంది.
అందుకే, ఇప్పట్నుంచే పవన్ ను దువ్వే ప్రయత్నం చేస్తోంది ఏపీ బీజేపీ. అందరికంటే ముందు జనసేన పార్టీపై కర్చీఫులు వేస్తోంది. ఓవైపు పొత్తులోనే ఉన్నాం అంటూనే, మరోవైపు పవన్ ఎక్కడ చేజారిపోతాడో అనే భయం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని అదే పనిగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు సోము వీర్రాజు. పనిలోపనిగా టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పలేదంటూ భుజాలు తడుముకుంటున్నారు. తామిద్దరం కలిసే ఉంటామని, కలిసే పోటీచేస్తామని పదే పదే చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ఎక్కడా చెప్పలేదంటున్నారు సోము. అదంతా మీడియా సృష్టి అంటున్నారు.
మరోవైపు రోడ్డు మ్యాప్ పై ఉన్న కన్ఫ్యూజన్ ను కూడా తొలిగించే ప్రయత్నం చేశారు. అప్పుడెప్పుడో తిరుపతి వచ్చిన అమిత్ షా, అప్పుడే తమకు రోడ్ మ్యాప్ ఇచ్చారని అన్నారు సోము వీర్రాజు. మరి అలాంటప్పుడు మొన్నటి సభలో రోడ్ మ్యాప్ కావాలని పవన్ అడగడం ఏంటనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు. వైసీపీని ఓడించడమే.. బీజేపీ-జనసేన రోడ్ మ్యాప్ అంటూ ముక్తాయించారు.