వ్యవస్థల్లోనే కాదు, ప్రత్యర్థి పార్టీల్లో కూడా తన మనుషుల్ని ఉంచుకుంటూ కుట్ర రాజకీయాలు చేయడం బాబుకి బట్టర్ తో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఒక ప్లాన్ ప్రకారం టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారాయన. బాబు నమ్మిన బంటులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్లు ఆయన్ను వదిలిపెట్టడమేంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు.
కానీ, తర్వాత కాలంలో ఇదంతా బాబు మాస్టర్ ప్లానేనని జనాలకు అర్థమైంది. నాయకులేం ఖర్మ, ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణని కూడా తన చేతిలో కీలుబొమ్మ చేసుకున్న ఘనత చంద్రబాబుది. జనసేనానికి ఎలాగూ బాబు దత్తపుత్రుడనే పేరుంది.
ఇన్నాళ్లూ ఈ ఆటలన్నీ సాగాయి కానీ, ఏపీలో బీజేపీ అధ్యక్ష పీఠం సోము వీర్రాజుకి దక్కడంతో ఈ లెక్కలన్నీ తప్పాయి. వీర్రాజు వస్తూ వస్తూనే తమ టార్గెట్ టీడీపీ అని ఢంకా భజాయించారు. మూడు రాజధానుల విషయంపై సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యల్ని బహిరంగంగానే ఖండించి చంద్రబాబుకి పెద్ద షాకిచ్చారు. ఇకపై టీడీపీకి, వారి విధానాలకు అనుకూలంగా బీజేపీ నుంచి ఎవరూ మాట్లాడే సాహసం చేయకుండా గడ్డిపెట్టారు.
టీడీపీకి తొత్తులుగా పనిచేస్తున్న ఒక్కొక్కరినీ ఏరిపారేయడం మొదలు పెట్టారు వీర్రాజు. టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓవీ రమణపై ఇటీవలే వేటు వేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓ ఆర్టికల్ రాసినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తాజాగా వెలగపూడి గోపాలకృష్ణ కూడా అలాగే సస్పెండ్ అయ్యారు. ఇటీవల అమరావతిలో జరిగిన రైతుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్న గోపాలకృష్ణ.. తన చెప్పుతో తానే కొట్టుకుని హడావిడి సృష్టించారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా నిలబడలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసారు.
చంద్రబాబు గేమ్ షో లో ఇది కూడా ఒక భాగమే. ఆ చెప్పుతో కొట్టుకునే ఎపిసోడ్ ని ఏబీఎన్ బాగా హైలెట్ చేసింది. దీంతో బీజేపీ నేతలు కలవరపడతారని ఊహించారు బాబు. కానీ ఏకంగా చెప్పు తీసిన నేతకు చీటీ చించేసింది కమలం పార్టీ. గోపాల కృష్ణకు ఓ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీ ఉందని, టీడీపీ హయాంలో ఈ కంపెనీకి చాలా మేళ్లు జరిగాయని బీజేపీ వద్ద సమాచారం ఉంది.
ఒక్కొక్కరిగా ఇలా టీడీపీ గూఢచారుల్ని, బాబుకి వత్తాసు పలికే నాయకుల్ని ఏరిపారేస్తూ పార్టీపై తనదైన ముద్రవేస్తున్నారు వీర్రాజు. ఇదే ఇప్పుడు చంద్రబాబుకి కంటగింపుగా మారింది.