ఇంతలో ఎంత తేడా? సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఒక సీజన్ ఐపీఎల్ లో ఒంటి చేత్తో విజేతగా నిలబెట్టిన ఛాంపియన్ ఆటగాడు అతడు. ఆ తర్వాతి సీజన్లలో కూడా మరీ పరువు తీయలేదు. జట్టు కూర్పు ఎలా ఉన్నా నెట్టుకొచ్చాడు. అట్టర్ ఫ్లాప్ అంటే.. ప్రస్తుత సీజన్లోనే. ఈ ఏడాది సమ్మర్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగినప్పుడు వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ జట్టు చిత్తుగా ఓడుతూ వచ్చింది. ప్రతి మ్యాచ్ కూడా విజయావకాశాలు మెండుగా ఉన్న స్థితి నుంచి చేతిలోని మ్యాచ్ ను వదులుకోవడం అనే రీతిన ఆ జట్టు ఓటమి పాలవుతూ వచ్చింది. తొలి మ్యాచ్ నుంచి అదే కథ.
ఒకటీ రెండు ఓవర్లలోనే మొత్తం కథ మారిపోవడం రివాజుగా మారింది. చెత్తగా ఆడి ఓటమి పాలు కావడం ఒక ఎత్తు. అయితే విజయం ఖాయం అనుకున్న దశ నుంచి ఓడటం మరో ఎత్తు. ఈ రెండో రకం ఓటమితో ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో కూడా చిరాకును పుట్టించింది. ఈ క్రమంలో వార్నర్ కెప్టెన్సీపై యాజమాన్యానికి మొహం మొత్తింది. సీజన్ మధ్యలోనే మార్పు చేసింది. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ కు కెప్టెన్సీని అప్పగించింది.
అయితే వాయిదా అనంతరం జరుగుతున్న తర్వాత కూడా ఎస్ఆర్హెచ్ ప్రదర్శన ఇట్టే మారిపోలేదు. విలియమ్సన్ కెప్టెన్సీలో కథంతా మారిపోలేదు. ఇప్పుడు కూడా ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే ఉంది!
అయితే ఇంతలో మరో కుదుపు. వార్నర్ ను ఫైనల్ లెవన్ లో ఆడించడం మాట అటుంచి, అతడిని కనీసం స్టేడియం కు కూడా తీసుకురావడం లేదు! తాజా మ్యాచ్ లో వార్నర్ ఎస్ఆర్హెచ్ డగౌట్ లో కూడా కనపడకపోవడంపై అభిమానులు కూడా స్పందిస్తున్నారు. వారి స్పందనపై వార్నర్ కూడా ప్రతిస్పందించాడం గమనార్హం.
తను ఇక ఎస్ఆర్హెచ్ తరఫున స్టేడియంలో కూడా కనిపించకపోవచ్చని వార్నర్ స్పందించాడు. వార్నర్ ను మరీ ఇలా అవమానించడంపై ఎస్ఆర్హెచ్ కోచ్ సమర్థించుకోవడం గమనార్హం. తాము వార్నర్ ను మాత్రమే హోటల్లో వదిలేసి రాలేదని, మరింత మంది సీనియర్ ప్లేయర్లు కూడా అక్కడే ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు కోచ్. అయినా ఒకనొక దశలో ఎస్ఆర్హెచ్ కు అంతా తానైన వార్నర్ ను మరీ ఇలా హోటల్ రూమ్ లో వదిలేసి రావడం గమనార్హం. గెలిపిస్తే.. తప్ప ఆటగాళ్లకు యాజమాన్యాలు మద్దతు ఇస్తామనడంలో కూడా వింత లేదేమో కానీ, మరీ ఈ రేంజ్ లో పక్కన పెట్టేయడం అనే దుష్టసంప్రదాయాన్ని మొదలుపెట్టినట్టుగా ఉన్నారు!