ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందుకే సాగనుంది. ఇదే విషయమై ఏలూరు సభలో సీఎం జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గత పాలకుల తప్పిదాలను తన ప్రభుత్వం సరిదిద్దుతుందని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్ ప్రాజెక్టుకు శుక్రవారం సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.
ఆరోగ్యశ్రీ తనకు సంతృప్తినిచ్చిన పథకాల్లో ఒకటిగా చెప్పారు. అలాగే పిల్లల చదువుకు సంబంధించి తాను మొదటి నుంచి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 9న పిల్లల చదువుకు భరోసా ఇచ్చేందుకు అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. పిల్లలను చదివించేందుకు తల్లులు భయపడ వద్దని ధైర్యాన్నిచ్చారు.
ఇలా సాగిన ఆయన ప్రసంగం చివర్లో నర్మగర్భంగా చాలా కీలకమమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలనేది తన ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాల వాళ్లు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగా తన ప్రభుత్వం కొన్నినిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు.
అలాగే అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లు, నిధులు, నియామకాలు లభించేలా తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తన ప్రభుత్వం సరిదిద్దుతుందన్నారు. మీరిచ్చిన ఈ అధికారాన్ని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సద్వినియోగం చేసుకుంటానని జగన్ ప్రకటించారు.
చివర్లో జగన్ మాట్లాడిన ప్రతి మాటా మూడు రాజధానులపై ముందుకు వెళ్లనున్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చినట్టైంది. అందరూ బాగుండాలని, అన్ని ప్రాంతాలు బాగుండాలనడం, నీళ్లు, నియామకాలు, నిధులు అన్ని ప్రాంతాలకు సమానంగా దక్కాలని జగన్ చెప్పిన మాటల్లోని ఆంతర్యం మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమనే సంకేతాలను మరోసారి ఏలూరు సభ ద్వారా జగన్ ఇచ్చారనేది సుస్పష్టం.