మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో రైసా అన్సారీ అనే మహిళ తోపుడు బండిపై కూరగాయల వ్యాపారం చేస్తోంది. 20 మంది ఉన్న కుటుంబానికి ఆ వ్యాపారమే ఉపాధి. కరోనాతో రెండు నెలలకు పైగా వ్యాపారం బంద్ కావడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. లాక్‌డౌన్‌లో సడలింపులతో మళ్లీ ఆమె బతుకు తోపుడు బండి రోడ్డెక్కింది.
అయితే ఇండోర్ మున్సిపల్ అధికారులు ఆమె తోపుడు బండిని పక్కకు నెట్టేశారు. దీంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకోకపోతే పూట గడవని దుస్థితి. మున్సిపల్ అధికారుల తీరుతో పస్తులుండాల్సి వస్తుందనే భావనతో కడుపు రగిలిపోయింది.
ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు…మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తప్ప అని గట్టిగా నిర్ణయించుకొంది. దీంతో మున్సిపల్ అధికారులపై నడిరోడ్డు మీద నోటికి పనిచెప్పింది. ఇంగ్లీష్‌లో ఆమె అనర్ఘళంగా మాట్లాడుతుండడాన్ని చూసి మున్సిపల్ అధికారులు హడలిపోయారు. కరోనాతో మార్కెట్ మూతపడిందని, మరోవైపు తోపుడు బండిపై కూరగాయలు, పండ్లు అమ్ముకుంటుంటే మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని, ఇలాగైతే ఎలా బతకాలని ఆమె నిలదీశారు. మున్సిపల్ అధికారుల అన్యాయాన్ని చక్కటి ఇంగ్లీష్‌లో ప్రశ్నిస్తున్న రైసా అన్సారీని ప్రజలంతా ముగ్ధులై చూశారు.
దీంతో మున్సిపల్ అధికారులు దిగరాక తప్పలేదు. ముందుగా ఏం చదువుకున్నావని ఆమెను ప్రశ్నించారు. తాను దేవీ అహల్య విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్ సైన్స్ లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నట్టు ఆమె చెప్పింది. తన చదువుకు ఎక్కడా ఉద్యోగం దొరక్క చివరికి కుటుంబ పోషణకు తోపుడు బండిపై కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నట్టు ఆమె గర్వంగా చెప్పుకొచ్చింది.