ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెలకొల్పిన రికార్డ్ బద్దలైంది. సీఎం రికార్డ్‌ను తాజాగా బద్వేల్ ఉప ఎన్నికలో సొంత పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ బద్దలు కొట్టడం విశేషం.
డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మృతితో బద్వేల్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ ఉప ఎన్నిక బరిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నిలిచారు.
ఈ ఉప ఎన్నికలో వైసీపీ అనుకున్నట్టుగానే భారీ మెజార్టీతో విజయం సాధించింది. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నరేశ్‌పై డాక్టర్ సుధ 90,550 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డ్ సృష్టించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన సమీప ప్రత్యర్థి ఎస్వీ సతీష్‌రెడ్డిపై 90,110 ఓట్ల అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఈ భారీ మెజార్టీని వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ అధిగమించి జగన్ రికార్డ్‌ను తిరగరాశారు. జగన్ కంటే 440 ఓట్లను అధికంగా సాధించడం విశేషం. ఒకవైపు జగన్ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ విజయం ఆ పార్టీకి గొప్ప ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.