సామాన్యులపై ఆరోపణలు చేస్తే మాత్రం సంచలనాల కోసం హడావుడి చేసే మీడియా, అదే మహిళ ఓ ప్రముఖుడిపై చేస్తే మాత్రం చూసే దృష్టి వేరుగా ఉంటోంది. న్యాయం ఎప్పుడూ సామాన్యుల విషయంలో వివక్ష చూపుతూ ఉంటుంది. ఆ విషయం మరోసారి రుజువైంది. ప్రముఖ నిర్మాతపై ఆరోపణలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ను ఏకంగా పిచ్చిదాన్ని చేయడం గమనార్హం. మరి ఇదే నీతి మూడేళ్ల క్రితం సినీ క్రిటిక్ కత్తి మహేశ్ విషయంలో ఎందుకు కొరవడిందనేది ప్రశ్న.
ప్రముఖ సినీ నిర్మాత బన్ని వాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మబలికి మోసం చేశాడని సోషల్ మీడియా వేదికగా, అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లో గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట తీవ్ర ఆరోపణలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బోయను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చకు తెరలేపింది. ఈ సునీతనే సరిగ్గా మూడేళ్ల క్రితం టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై దుమారం చెలరేగినపుడు పక్కా కుట్రలో భాగంగానే కత్తి మహేశ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతులను సోషల్ మీడియా గుర్తు చేస్తోంది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కత్తి మహేశ్ విషయంలో సదరు సునీత లైంగిక ఆరోపణలకు మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. దీని వెనుక కొందరు సినీ పెద్దల ప్రమేయం ఉందని నాడు కత్తి మహేశ్ ఆరోపించిన సంగతిని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
తనతో కత్తి మహేశ్ అసభ్యంగా ప్రవర్తించాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత మూడేళ్ల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ షో వివరాల కోసం ఫోన్ చేస్తే ఇంటికి రమ్మన్నాడని, వెళ్లిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించడంతో కత్తి మహేశ్ నాడు ఇరకాటంలో పడ్డాడని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. తనను కమిట్‌మెంట్ అడగడంతో పాటు ఇతరత్రా సినీ పెద్దల వద్దకు వెళ్లాలని చెప్పినట్టు సునీత తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో టాలీవుడ్‌లో దుమారం రేపింది.
కత్తి మహేశ్ సినీ క్రిటిక్‌గా అప్పటికి కొంత మందికి మాత్రమే తెలుసు. బిగ్‌బాస్ రియాల్టీ షోకు వెళ్లి రావడం, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌పై తీవ్ర విమర్శలతో అతను నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. పైగా టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌లో మహిళా సంఘాలతో కలిసి అతను ఉద్యమ బాటలో నడిచారు. తనపై వచ్చిన ఆరోపణలపై నాడు కత్తి మహేశ్ గట్టిగానే స్పందించారు. ఈ మేరకు అప్పట్లో ఆయన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటన ఏంటో చూద్దాం.
“స్త్రీలను నేను అపురూపంగా చేసుకుంటా. గౌరవంగా, స్నేహపూర్వకంగా మెలుగుతా. ప్రేమిస్తే ప్రేమను వ్యక్తపరుస్తా. కాంక్షిస్తే అంతే గౌరవంగా చెబుతాను. కాదంటే వాళ్ల అభిప్రాయాన్ని సగౌరవంగా అంగీకరిస్తాను. సునీత లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. అది నిరూపించుకోవడంలో భాగంగా ఆ స్త్రీ మీద నేను 50 లక్షల పరువు నష్టం దావా వేస్తున్నాను. నాపై లైంగిక ఆరోపణలు షాక్‌కు గురి చేశాయి. సైరా సినిమా ప్రొడక్షన్ వర్క్ చూసే వాకాడ అప్పారావుపై పెద్ద సంఖ్యలో లైంగిక ఆరోపణలు వస్తున్నాయి. దాని నుంచి ఇష్యూను పక్కదారి పట్టించడానికి నాపై సునీతతో ఆరోపణలు చేయించారు. అంతే తప్ప, ఆమె ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు” అని కత్తి మహేశ్ నాడు చెప్పిన విషయాన్ని… ప్రస్తుతం సునీత అరెస్ట్ నేపథ్యంలో నెటిజన్లు మరోసారి గుర్తు చేయడం గమనార్హం.
బన్ని వాసు ప్రముఖ నిర్మాత కావడంపై ఆయనపై సునీత ఆరోపణలు మరుగున పడ్డాయని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు ఆమెను పిచ్చిదాన్ని చేసి సమాజంలో ఇక ఎక్కడా చెల్లకుండా చేశారని మండిపడుతున్నారు. కత్తి మహేశ్‌పై నిరాధార లైంగిక ఆరోపణలు చేసినప్పుడు చర్యలు తీసుకుని వుంటే… నేడు సెలబ్రిటీల వరకూ వచ్చేది కాదు కదా అని హితవు చెబుతున్నారు.
ఒకే మహిళ ఒక సామాన్యుడు, అలాగే సెలబ్రిటీపై అవే ఆరోపణలు చేసినప్పుడు వివిధ వ్యవస్థలు ఎంతటి వివక్షతో పని చేస్తాయో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత ఉదంతమే నిలువెత్తు నిదర్శనమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.