కేరళ జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇటీవల రిపబ్లిక్ టీవీ చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో , అందరి దృష్టి సిద్ధిఖీ పిటిషన్‌పై పడింది.
అందులోనూ అర్నాబ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వ్యక్తి స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సిద్ధిఖీ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని బెంచి విచారించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించాల్సి ఉందని బెంచి పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత యువతిపై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న హథ్రాస్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో సిద్ధిఖీ సహా మరో ముగ్గురు జర్నలిస్టులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని, అనైతికమని కేరళ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.
ఈ కేసులో నిందితుడు జర్నలిస్టు అని, ఆర్టికల్ 32 కింద వెంటనే ఉపశమనం పొందే ఉద్దేశంతో సుప్రీంను ఆశ్రయించినట్లు కపిల్ సిబాల్ అన్నారు. కానీ ఈ విషయమై అక్టోబర్ 12న అలహాబాద్ హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ బోబ్డే ప్రశ్నించారు. అయితే సిద్ధిఖీని కానీ, అతడి లాయర్లను కానీ తాను కలవలేదని, అందుకే హైకోర్టును సంప్రదించలేదని ఆయన వాదించారు.
సుప్రీంకోర్టులో ఇలాంటి విషయాలపై ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేస్తున్న రిట్ పిటిషన్లను నిరుత్సాహపరిచేందుకు కోర్టు ప్రయత్నిస్తోందని, ఇలాంటివి మొదట సంబంధిత హైకోర్టులకు వెళ్లాలని చీఫ్ జస్టిస్ సూచించారు. కానీ అర్నాబ్ గోస్వామికి ఇదే విషయంలో బెయిల్ మంజూరు చేయడాన్ని కపిల్ సిబాల్ ప్రస్తావించడం గమనార్హం.