ఎన్డీఏ-1 హయాంలో పెద్ద నోట్ల రద్దు అనే సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీకి 2019 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని అనుకున్నారంతా. కానీ మోడీ ప్రభ తగ్గలేదు సరికదా.. భారీ మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కరోనా కష్టకాలంలో మోడీ పని అయిపోయిందని అంటున్నారు.
లాక్ డౌన్ నిబంధనల పేరుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, ఉద్దీపన ప్యాకేజీలలో పసలేదని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే వాదనలు ఎక్కువయ్యాయి. అయితే ఇవి కూడా దూదిపింజల్లా తేలిపోతాయని సర్వేలు చెబుతున్నాయి.
కరోనా కష్టకాలం తర్వాత దేశంలో తొలిసారి జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందని ఏబీపీ సి-ఓటర్ సర్వే తేల్చి చెబుతోంది. 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో 73 నుంచి 81 స్థానాల్లో గెలిచి బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఆ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని తేల్చి చెప్పింది.
2015లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి కేవలం 53 సీట్లు వచ్చాయి. మహా ఘట్ బంధన్ మధ్యలోనే ముక్కలు కావడంతో.. జేడీయూకి వలవేసి నితీశ్ కుమార్ కే ముఖ్యమంత్రి పీఠం అప్పగించి బీజేపీ అధికారంలో భాగస్వామి అయింది. ఇప్పుడిక అలాంటి కష్టాలు కూడా లేకుండా బీజేపీయే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే తేల్చి చెబుతోంది.
అంటే లాక్ డౌన్ లో వలస కార్మికుల కష్టాలు, లాక్ డౌన్ తర్వాత చిరు వ్యాపారుల ఇబ్బందులు, సామాన్యుల ఉపాధి బాధలు.. ఏవీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయలేదని అర్థం చేసుకోవాలి. అంటే ఈ సారి కూడా కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతోందన్న మాట.
అటు లాలూ ప్రసాద్ వారసులు కూడా కేవలం జన సమీకరణకు పనికొస్తారే కానీ, ఓట్లు సంపాదించడంలో వెనకపడిపోతారని సి-ఓటర్ సర్వే చెబుతోంది. ఇక లోక్ జనశక్తి పార్టీ కూడా 5 స్థానాలలోపే ఆగిపోతుందని చెబుతున్నారు.
బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తే.. ఇక బీహార్ లో కమలదళానికి ఎదురే ఉండదు. నితీశ్ కుమార్ అధికార పరంపరకు అడ్డుకట్ట వేసినట్టే లెక్క. సర్వేలు నిజమైతే తొలిసారిగా బీహార్ రాష్ట్రం, పూర్తిస్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రి పాలనలోకి వస్తుందన్నమాట.