న్యాయం చేయాల్సిన పోలీసోడు అన్యాయం చేశాడు. భర్తపై కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్లిన ఆమెకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనలో సదరు ఎస్సైని సస్పెండ్ చేసిన అధికారులు, అంతర్గత విచారణకు ఆదేశించారు.
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్నాడు సుందరలింగం. అతడి పోలీస్ స్టేషన్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ వచ్చింది. తన రెండో భర్తపై ఫిర్యాదు చేసింది. రోజూ తాగి వచ్చి, తనతో పాటు తన కూతుర్ని కొడుతున్నాడని ఆమె ఎస్సై ముందు తన గోడు చెప్పుకుంది.
అయితే ఎస్సై సుందరలింగం ఆమె గోడు వినలేదు. ఆమె అందాన్ని చూశాడు, కామించాడు. కేసు నమోదు చేసుకునే నెపంతో రోజూ ఆమెను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకునేవాడు. కేసు ఫైల్ చేసిన తర్వాత విచారణ కోసం పిలిచేవాడు. అలా ఆమెతో మాటలు కలిపిన సదరు ఎస్సై, ఓ రోజు ఆమెను ఎవరూ లేని ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు.
అలా కొన్ని రోజుల పాటు సదరు మహిళను లైంగికంగా వేధించాడు ఎస్సై. కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై, ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. అమాయకురాలైన ఆ మహిళకు జరిగిన అన్యాయం పోలీస్ స్టేషన్ లో ఆనోట ఈనోట చేరి పై అధికారుల చెవిన పడింది. దీంతో ఆమె నుంచి ఫిర్యాదు తీసుకొని ఎస్సైని సస్పెండ్ చేశారు అధికారులు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.