అప్పట్లో అమరావతి ప్రాంతంలో ప్రతి సహజ మరణాన్నీ రాజధాని కోసం జరిగిన ఆత్మత్యాగంగా, రాజధాని కోసం ఆగిన గుండెగా అభివర్ణించాయి ప్రతిపక్షాలు, వాటికి వత్తాసు పలికే మీడియా సంస్థలు. రాజధాని కోసం ఆగిన మరో గుండె.. అనేది కామన్ హెడ్ లైన్ అయిపోయింది అప్పట్లో. కాలక్రమంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులే ఛీకొట్టే సరికి ఆ ప్రచారం ఆగిపోయింది. ఇప్పుడు కొత్తగా పింఛన్ కోసం ఆగిన గుండె అంటూ మరో ప్రచారం మొదలైంది.
సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ఏపీలో అనర్హుల ఏరివేత మొదలైంది. ఇలాంటి దిద్దుబాటు చర్యలు మొదలైనప్పుడు కొంతమంది మనస్తాపానికి గురవడం సహజమే. అనర్హులై కూడా అప్పటివరకూ పింఛన్ తీసుకున్నందుకు ఎవరూ చిన్నతనంగా భావించరు. ఎకరాలకెకరాలు భూమి ఉండి, పిల్లలు ఉద్యోగాల్లో ఉండి కూడా కొంతమంది పింఛన్లు తీసుకుంటున్నారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది.
నెలకు 3 వేల రూపాయలకు పైగా కరెంటు బిల్లు చెల్లించేవారు కూడా ప్రభుత్వం ఇచ్చే 2250 రూపాయల పింఛన్ ను తీసుకుంటున్నారు. అందుకే కరెంటు బిల్లులు, పొలాల వివరాలు సేకరించి అనర్హుల జాబితా బయటకు తీస్తున్నారు వాలంటీర్లు, సచివాలయ అధికారులు. దీంతో ప్రతిపక్షాలు వారిని రెచ్చగొట్టే పనిలో పడ్డాయి.
ఓవైపు పింఛన్లు కోల్పోతున్నవారిని రెచ్చగొడుతూనే, మరోవైపు ఎక్కడైనా ఎవరైనా పింఛన్ పోయినవారు సహజ మరణం చెందినా, దాన్ని రాజకీయం కోసం వాడుకోవాలనుకుంటున్నారు ప్రతిపక్ష నేతలు. వారికి వత్తాసు పలికే మీడియా సంస్థలు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి.
పింఛన్ల కోసం ఆగిన గుండె అని, పింఛన్ రాదని తెలిసి మనస్తాపంతో కన్ను మూసిన అవ్వ, తాత అని సెంటిమెంటల్ గా అందర్నీ రెచ్చగొడుతున్నాయి. గతంలో అమరావతి విషయంలో సెంటిమెంట్ రెచ్చగొట్టినట్టే ఇప్పుడు పింఛన్లు కోల్పోయినవారి విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా సీన్ క్రియేట్ చేస్తున్నారు.
ఏపీలో అక్రమంగా పింఛన్లు తీసుకునేవారినే కాదు, రేషన్ కార్డుల ప్రక్షాళన కూడా మొదలవుతోంది. రేషన్ కార్డు ఉండి కూడా.. రేషన్ బియ్యం తీసుకోనివారు అసలు పేదవారేనా, నిజంగా పేదవారే అయితే రేషన్ బియ్యం ఎందుకు తీసుకోవడంలేదని ఆరా తీస్తున్నారు. 3 నెలలు పైబడి రేషన్ సరకులు తీసుకోనివారి కార్డు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు. దీంతో అనర్హుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఏ పథకానికైనా నూటికి నూరుపాళ్లు న్యాయం జరగాలంటే.. కేవలం అది అర్హులకు మాత్రమే అందాలి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అదే చేస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాద్ధాంతం చేస్తున్నాయి.