టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారు. మీడియాలో తప్ప జనంలో కనిపించని పట్టాభిని పార్టీలోని ఓ వర్గం పథకం ప్రకారం ప్రోత్సహిస్తుండటంపై టీడీపీ అధికార ప్రతినిధులు మండిపడుతున్నారు. పార్టీని కొమ్మారెడ్డికి పట్టా రాయించినట్టు, అన్నీ తానై మీడియా మేనేజ్‌మెంట్ చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మచ్చుకు కొందరి గురించి చర్చిద్దాం. టీడీపీ అధికార ప్రతినిధులుగా గొట్టిపాటి రామకృష్ణ, తిరుపతికి చెందిన ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి, సినీ నటి దివ్యవాణి తదితరులు ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుండేవారు. మరీ ముఖ్యంగా తిరుపతికి చెందిన ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి రాజకీయ విశ్లేషకుడిగా అన్ని చానళ్లలో కనిపించేవాడు. ఎప్పుడైతే టీడీపీలో చేరాడో , ఆ క్షణం నుంచి ఆయన్ను ఎక్కడా కనిపించకుండా చేయడంలో పార్టీలోని కమ్మ లాబీయింగ్ బలంగా పనిచేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో ఆయన వెలుగు మూణ్నాళ్ల ముచ్చటైందని చెబుతున్నారు.
చివరికి తిరుపతి ఉప ఎన్నికలు, టీటీడీపై స్థానికంగా ఉండే సుధాకర్‌రెడ్డిని కాకుండా పట్టాభినే పిలవడం వెనుక వివక్ష స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు ఆ పార్టీ ప్రతినిధుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అలాగే మంత్రి కొడాలి నానికి దీటుగా కౌంటర్లు ఇచ్చే సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి కూడా ఇటీవల కనిపించడం మానేశారు.
టీడీపీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న అణచివేత చర్యలకు దివ్యవాణి మనస్తాపం చెందినట్టు సమాచారం. ఏమండోయ్ నానీ గారు అంటూ మంత్రికి తనదైన స్టైల్‌లో ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందచందాలతో పాటు మంచి వాక్చాతుర్యం కలిగిన దివ్యవాణికి వస్తున్న పాపులారిటీపై పార్టీలోని బాబు సామాజిక వర్గానికి చెందిన కొందరికి కన్నుకుట్టి… పొమ్మనకుండా పొగబెడుతున్నారని సమాచారం.
మరీ ముఖ్యంగా హిందూదేవాలయాలపై దాడి సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ క్రిస్టియానిటీని రాజకీయ విమర్శలకు చంద్రబాబు వాడడంపై ఆమె పార్టీ సమావేశంలోనే నిలదీసిన సంగతి తెలిసిందే. దీన్ని సాకుగా తీసుకుని దివ్యవాణిపై చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. క్రిస్టియన్ అయిన దివ్యవాణి విధానాలు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయంటూ ఆమెపై పార్టీ వ్యతిరేక ముద్ర వేశారని చెబుతున్నారు.
అలాగే గొట్టిపాటి రామకృష్ణ లాంటి పద్ధతి గల అధికార ప్రతినిధికి కూడా టీడీపీలో తగిన స్థానం దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈయన బాబు సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ, హద్దులు దాటి వ్యవహరించరనే పేరుంది. ఇదే ఆయన ఎదుగుదలకు టీడీపీలో అవరోధంగా మారినట్టు తెలుస్తోంది. ఏఏ చానళ్లకు ఎవరెవరు వెళ్లాలో నిర్ణయించడంలో టీడీపీ నేత మాల్యాద్రి కీలక పాత్ర పోషిస్తున్నారనేది బహిరంగ రహస్యమే.
టీడీపీ అధికారంలో ఉన్నంత వరకూ మాల్యాద్రి అన్ని చానళ్లలో కనిపించేవాళ్లు. ఇప్పుడు తనకు బదులుగా పట్టాభిని తెరమీదకి తీసుకురావడం, ఇతర సామాజిక వర్గాల అధికార ప్రతినిధులను అణచివేయడం కళ్లకు కడుతోంది. తెల్లారడమే ఆలస్యం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి చానళ్లలో కనిపిస్తారు. సాధారణంగా ఒక్కో చానల్‌కు ఒక్కో అధికార ప్రతినిధిని పంపడం ఆనవా యితీ. అయితే టీడీపీలో మాత్రం ఆ సంప్రదాయానికి ఇటీవల మంగళం పాడారని ఆ పార్టీ అధికార ప్రతినిధులు చెబుతున్నారు.
టీడీపీకి చెందిన రెండు అనుకూల చానళ్లకు ఏఏ పార్టీ నుంచి ఎవరెవరిని పిలవాలో, తటస్థులైన రాజకీయ విశ్లేషకులను అసలు పిలవాలా? వద్దా? అనేది కూడా పట్టాభినే నిర్ణయిస్తున్నారంటే… ఏ స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తనకు గట్టి కౌంటర్ ఇచ్చే ఇతర విశ్లేషకులను పిలవొద్దని పట్టాభి కండీషన్ పెడుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేకపోలేదు. తన సొంత పార్టీ ప్రతినిధులకు కూడా ఆయనే కళ్లెం వేస్తున్నారని టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.
టీడీపీ తరపున వాయిస్ వినిపించాలంటే అడ్డగోలుగా మాట్లాడితే చాలని, మంచీచెడులు, విచక్షణతో సంబంధం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటే మరీ మంచిదని చెబుతున్నారు. ప్రజల్లో గౌరవం లేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా టీడీపీ ఎలాంటి సందేశాలను పంపుతున్నదో అర్థం కావడం లేదని, ఇలాగైతే పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమని ఆ పార్టీ అధికార ప్రతినిధులు వాపోతున్నారు.