ఉదయం లేస్తే పాచిపళ్లతో నినాదాలు చేస్తారు. సత్యం నినదించుగాక అంటూ పొద్దునే సూక్తులు. తీరా వార్తల్లోకి వెళితే మాత్రం.. వీక్షకులు అవాక్కవాల్సిందే! సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీజేఐకి లేఖ రాస్తే దాని ప్రస్తావన మాటమాత్రమైనా ఉండదు! అదే ఆ లేఖను ఎల్లయ్యలూ, పుల్లయ్యలు ఖండిస్తే అది పతాక శీర్షిక వార్త అవుతుంది!
గతంలో తమకు నచ్చని రాజకీయ అంశాల గురించి తమదైన వ్యాఖ్యానాన్ని ఇచ్చేవి పచ్చ పత్రికలు. తెలుగుదేశం అనుకూల అజెండాకు అనుకూలంగా ప్రతి వార్తనూ వండి వార్చేవి. అయితే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేక.. అసలు తమ వ్యతిరేక వార్తలను కవర్ చేయడమే మానేసేంత వరకూ వచ్చేశారు!
గతంలో వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు రోజులకు ఒకసారి ప్రభుత్వ వ్యతిరేక కథనాలతో విరుచుకుపడే వారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై అలాంటి కథనాలను రాయడం మాట అటుంచితే, టీడీపీకి డ్యామేజ్ చేసే అంశాలను అడ్డుకోవడమే కష్టమైపోతోంది ఆ రెండు పత్రికలకూ.
ఈ క్రమంలో గీతమ్ యూనివర్సిటీ ఆక్రమణలను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేయడంపై టీడీపీ అనుకూల మీడియా ఇచ్చిన కథనాల్లో యథావిధి కామెడీ కొనసాగింది. తెల్లవారుజామునే అధికారులు గీతమ్ వర్సిటీని చేరుకున్నారట, అప్పుడే పని ప్రారంభించారట. మొత్తం ధ్వంసం చేశారట. ఇంత రాసినా.. ఎక్కడా ఆక్రమణ.. అనే మాట లేదు!
అక్కడికేదో రెవెన్యూ అధికారులు వెళ్లి గీతమ్ వర్సిటీ మీద దాడి చేసినట్టుగా ఉంది ఈనాడు కథనం. 40 ఎకరాలు ఆక్రమించారు అని పూర్తి నిర్ధారణ చేశాకా కానీ అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు. దాని చరిత్రంతా శోధించి.. 40 ఎకరాల ఆక్రమణ జరిగిందనే విషయాన్ని నిర్ధారించిన తర్వాతే చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే అధికారుల వెర్షనే ఇవ్వరు!
విశాఖలో భూ ఆక్రమణల గురించి టీడీపీ తెగ రంకెలేస్తూ ఉంటుంది. అయితే గీతమ్ వర్సిటీ వద్ద రెవెన్యూ అధికారులను అడ్డుకోవడానికి టీడీపీ శ్రేణులు భారీగా వెళ్లాయట! మొత్తానికి తాము కూస్తే తప్ప తెల్లవారదు, తాము రాస్తే తప్ప తెలుగు ప్రజలకు ఏమీ తెలియదనే నమ్మకం నుంచి పచ్చ వర్గాలు బయటకు రావేమో ఎప్పటికీ!