నోటికి ఏదోస్తే అది మాట్లాడటం, ఆ తర్వాత వాళ్ల భజనే చేయడం.. ఇది తెలుగుదేశం పార్టీలో ఎవరో చోటామోటా నేతలు చేసే పని కాదు. స్వయంగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లు చేసే పనిగా మారింది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ ను తిట్టి, సోనియాను దెయ్యం, రాక్షసి అంటూ మాట్లాడి.. మళ్లీ వాళ్ల ఇంటి ముందు నిలబడిన ఘనత చంద్రబాబుది.
జనాలు ఛీత్కరించుకుంటారు అనే సిగ్గు ఏ మాత్రం లేకుండా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్లతో భుజాలు రాసుకుపూసుకు తిరిగారు. ఆ కలయికను అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఏపీ ప్రజలు అసహ్యించుకున్నారు. పరమ అవకాశవాదాన్ని చూపిన చంద్రబాబును 23 సీట్లతో సత్కరించారు.
ఇక అవే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ప్రధాని మోడీని ఎన్ని మాటలు అన్నారో ఎవరికీ తెలియనిది ఏమీ కాదు. మోడీని దించడానికే తను కంకణం కట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వందల, వేల సార్లు ప్రకటించుకున్నారు. అందుకోసమని దేశమంతా తిరిగారు. బీజేపీ వ్యతిరేక అన్ని పార్టీలతోనూ కలిశారు. అయితే ఆ పార్టీల వాళ్లంతా ఇప్పటికీ బీజేపీ వ్యతిరేక స్టాండుతోనే నిలబడ్డాయి.
డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, టీఎంసీ ఈ పార్టీలన్నీ తమ రూటును మార్చుకోలేదు. అయితే అవకాశవాదంలో పండిపోయిన చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు మోడీ భజన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న భజనను చూసి బీజేపీ వాళ్లు కూడా అసహ్యించుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్లు వదిలిన పంచ్ డైలాగులు కొన్ని గుర్తు చేయాలి. జగన్ మోదీ రెడ్డి అంటూ.. నారా లోకేష్ ట్వీట్లేశారు. ఆ డైలాగులనే ప్రచారంలోనూ పలికారు. నోటికి ఏదోస్తే అది అలా మాట్లాడారు. ఎవరు రాసిచ్చారో కానీ.. అలా పంచ్ లేశారు. ఇప్పుడేమో మోడీ భజన చేస్తున్నారు! మరీ దీన్నేమనాలో లోకేష్ కే తెలియాలి!
జగన్ మోదీ రెడ్డి అంటూ ట్వీట్లేసి.. ఇప్పుడు అదే మోడీ కాళ్లూగడ్డాలు పట్టుకుంటున్నట్టుగా మాట్లాడటం తెలుగుదేశం పార్టీ మార్కు రాజకీయమా? ఇప్పుడు జగన్ మోదీ రెడ్డి కాదా? ఇప్పుడు చంద్రబాబు మోదీ నాయుడా? అప్పుడు లోకేష్ రాహుల్ నాయుడా? ట‌్వీటండి లోకేష్ గారూ!