సోషల్ మీడియాపై టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు అధికార పార్టీ వైసీపీ మాత్రం ఇప్పట్లో సోషల్ మీడియాతో పనిలేదనే భావనలో ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వందలాది మంది సోషల్ మీడియా వేదికగా పాలనలోని తప్పులను ఎండగడుతూ వచ్చారు. ఇది సహజంగానే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి రాజకీయంగా కలిసొచ్చింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు జరిగిన మేలేంటో ఎవరికీ తెలియడం లేదు. పైగా న్యాయమూర్తులను దూషించిన కేసులో కొందరు సీబీఐ కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది.
సీఎం సొంత జిల్లా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని ముతుకూరు నివాసైన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం, అధికార పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో ఆందోళన రేకెత్తించింది.
ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఎవరూ ఆదుకోరనే జ్ఞానోదయం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో కలిగిందని సొంత పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరో వైపు అధికారం వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో తమను పట్టించుకోలేదనే ఆవేదన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో ఉంది. దీంతో గతంలో మాదిరి వైఎస్ జగన్‌ను సోషల్ మీడియా యాక్టివిస్టులు భుజాన మోయడం లేదు.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా టీడీనీ డిజిటల్ పదవుల పందేరాన్ని టీడీపీ చేపట్టింది. 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు ఐటీడీపీ (డిజిటల్ టీడీపీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
దీంతో టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్‌గా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అధికార పార్టీ సోషల్ మీడియాను పార్టీ పెద్దలు ఏ విధంగా పట్టించుకుంటారో చూడాల్సి ఉంది.