జనసేనాని పవన్‌కల్యాణ్ వివాదంలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. పవన్ వర్సెస్ జగన్ ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేశ్ ఊసే లేకుండా పోయారు.
సినిమా ఫంక్షన్‌లో జగన్ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ తీవ్ర విమర్శలు మొదలుకుని, ఇప్పటి వరకూ… జనసేన, వైసీపీ మధ్య నువ్వానేనా అన్న రీతిలో పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ జనంలో కనీసం చర్చకు లేని పరిస్థితి. ఇది ముమ్మాటికీ టీడీపీకి నష్టం కలిగించేదే.
ఏపీ ప్రభుత్వం, జనసేనాని పవన్‌కల్యాణ్ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.పవన్‌కు దీటుగా, ఘాటుగా వైసీపీ నుంచి సమాధానాలు వెళ్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలంటే వైసీపీ, జనసేన మాత్రమే అని ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చూస్తే ఎవరికైనా అభిప్రాయం కలుగుతుంది.
తాజాగా రాజమండ్రిలో పవన్‌కల్యాణ్ రోడ్ల మరమ్మతుల పేరుతో చేపట్టిన శ్రమదానం నిరసన కార్యక్రమం ఉత్కంఠకు తెరలేపింది. ఇదే పని ప్రధాన ప్రతిపక్షం ఈ రెండేళ్లలో ఎందుకు చేయలేకపోయిందనే ప్రశ్నలు వస్తున్నాయి.
పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో ప్రయాణమైన మొదలు… రాజమండ్రిలో ర్యాలీ నిర్వహణ వరకూ ఏకధాటిగా ఎల్లో మీడియా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. దీంతో పవన్‌కల్యాణ్‌కు విస్తృతమైన ప్రచారం వస్తోంది. ఇదంతా రాజకీయంగా పవన్‌కు కలిసొస్తుంది.
ఇదే సందర్భంలో టీడీపీ ఉనికి లేకపోవడం ఆ పార్టీకి డ్యామేజీ కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పచ్చదళం ఆశిస్తున్నట్టుగా… బీజేపీని కాదని టీడీపీతో జనసేనాని పొత్తు పెట్టుకుంటే 2024లో లాభిస్తుంది. అలా కాకుండా బీజేపీతోనే జనసేనానికి కొనసాగితే, ఇప్పుడు చేస్తున్న ప్రచారమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందనే ఆందోళన ఎల్లో మీడియా, టీడీపీలో లేకపోలేదు.