బిహార్ ఎగ్జిట్ పోల్స్‌పై టీడీపీ, వైసీపీ మ‌న‌సులో మాట‌…

బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ మ‌హాకూట‌మి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటుంద‌ని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగింది.  Advertisement నాలుగో సారి ముఖ్య‌మంత్రి కావాల‌ని నితీశ్‌కుమార్ త‌హ‌త‌హ‌లాడారు. ఎన్నిక‌ల…

బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ మ‌హాకూట‌మి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటుంద‌ని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. 

నాలుగో సారి ముఖ్య‌మంత్రి కావాల‌ని నితీశ్‌కుమార్ త‌హ‌త‌హ‌లాడారు. ఎన్నిక‌ల పోరు తుది అంకానికి చేరిన ద‌శ‌లో త‌న‌కు ఇవే చివ‌రి ఎన్నిక‌ల‌ని, గెలిపించాల‌ని ఆయ‌న సెంటిమెంట్ పాచిక విస‌ర‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.  

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ, జేడీయూతో కూడిన ఎన్డీఏ కూట‌మి 40 సీట్ల‌లో 39 గెలుచుకుని త‌మ‌కు తిరుగులేద‌ని నిరూపించుకుంది. అయితే ఏడాది తిరిగే లోపే ప్ర‌జాభిప్రాయం ఆ కూట‌మికి వ్య‌తిరేకంగా వ‌స్తుంద‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. నిజానికి మ‌రోసారి నితీశ్‌కుమారే ముఖ్య‌మంత్రి అవుతార‌ని అంద‌రూ భావించారు.

తేజిస్వీ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ మ‌హాకూట‌మినే విజ‌యం వ‌రిస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డిస్తున్న నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన పార్టీల మ‌న‌సులో మాటేంటి? అనేది స‌హ‌జంగానే చ‌ర్చ‌కు వ‌స్తుంది. 

బిహార్‌లో ముఖ్యంగా బీజేపీ కూట‌మి ఓడిపోతుంద‌ని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండ‌డంపై ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌న‌సులో సంబ‌ర‌ప‌డుతున్నాయి. తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగంగానే బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న విష‌యం తెలిసిందే.

కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఎవ‌ర్నీ లెక్క చేయ‌క‌పోవ‌డ‌మే కాకుండా త‌మ చేతుల్లో ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను పెట్టుకుని బెదిరింపుల‌కు పాల్ప‌డుతోంద‌నే అభిప్రాయంలో ప్రాంతీయ పార్టీలున్నాయి. 

అంతేకాదు అభివృద్ధి విష‌యంలో రాష్ట్రాల‌కు  మోడీ స‌ర్కార్ మొండిచేయి చూపుతోంద‌ని …. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ప్ర‌భుత్వాలు ఆగ్ర‌హంగా ఉన్నాయి. ఇటీవ‌ల జీఎస్టీకి సంబంధించి రావాల్సిన మొత్తాల్లో కూడా కోత విధిస్తామ‌ని చెప్ప‌డం తెలిసిందే.

ఉదాహ‌ర‌ణ‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే ప్ర‌త్యేక హోదాను అట‌కెక్కించింది. తాము ఇచ్చే ప్ర‌త్యేక ప్యాకేజీ మాత్ర‌మే తీసుకోవాల‌ని ఒక ర‌క‌మైన బ్లాక్‌మెయిల్‌కు పాల్ప‌డుతోంద‌ని టీడీపీ, వైసీపీలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. 

తాజాగా జాతీయ ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం నిర్మాణానికి నిర్వాసితుల వ్య‌యంతో త‌మ‌కు సంబంధం లేద‌ని తేల్చి చెప్ప‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం మోడీ స‌ర్కార్‌పై ఆగ్ర‌హంగా ఉంది.

కానీ త‌న‌పై కేసుల కార‌ణంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీయ‌లేని దుస్థితి. ఇక ప్ర‌తిప‌క్ష టీడీపీ అధినేత చంద్ర‌బాబుది అదే ప‌రిస్థితి. రాజ‌కీయ చ‌ర‌మాంకంలో ఉన్న త‌న‌పై ఎక్క‌డ సీబీఐ, ఈడీ కేసులు పెట్టి ఇరికిస్తారో న‌ని భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. దీంతో రాష్ట్రానికి మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కార్ తీర‌ని ద్రోహం చేస్తున్నా … నోరు తెర‌వ‌లేని ద‌య‌నీయ స్థితి.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు మోడీ స‌ర్కార్‌పై యుద్ధం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు …. అధికారం పోయిన వెంట‌నే కిక్కుర‌మ‌న కుండా ఉన్నారు. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా మోడీ-అమిత్‌షాల‌ను పొగడ్త‌ల‌తో ముంచెత్తేందుకు బాబు వెనుకాడ‌డం లేదు. 

ఇదేమీ వాళ్ల‌పై ప్రేమ‌తో కాద‌నే విష‌యం బీజేపీ నేత‌ల‌కు కూడా బాగా తెలుసు. కేసుల భ‌యంతో ప్రాంతీయ పార్టీల నేత‌లు అంత‌రాత్మ‌ల‌ను చంపుకుని బీజేపీతో చెలిమి చేసేందుకు న‌టించ‌క త‌ప్ప‌డం లేదు. ఈ నేప‌థ్యంలో బీజేపీ ప‌త‌నాన్ని స‌హ‌జంగానే వైసీపీ, టీడీపీ కోరుకుంటాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే కేసీఆర్ బీజేపీ అంటే ఒంటికాలిపై లేస్తున్నారు. తాజాగా ఒక్క రూపాయి కూడా వ‌ర‌ద సాయం అందించ‌ని కేంద్రంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బిహార్‌లో బీజేపీ మిత్ర‌ప‌క్ష కూట‌మి ఓట‌మి స‌హ‌జంగానే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌కు ఆనందం క‌లిగిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

అయితే ఎగ్జిట్ పోల్స్ ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతాయో తెలుసుకునేందుకు ప‌దో తేదీ వ‌ర‌కు వేచి చూడాల్సిందే. కానీ బీజేపీ మిత్ర‌ప‌క్ష కూట‌మి ఓట‌మి కోసం మ‌న‌సులో మాత్రం దేవుళ్లంద‌ర్నీ తెలుగు ప్రాంతీయ పార్టీలు కోరుకుంటున్నాయ‌న్న‌ది వాస్తం. ఆ రోజు ఫ‌లితాల్లో బీజేపీ కూట‌మి మ‌ట్టి కొట్టుకుపోతే మాత్రం వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ పండ‌గ చేసుకుంటాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

నన్ను పార్టీనుంచి బైటకు పంపట్లేదు