గ‌మ్యం గ‌మ‌నం లేని పాద‌యాత్ర‌…ఆరోగ్యం జాగ్ర‌త్త‌!

తెలంగాణ‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రభావం తెలంగాణ‌పై కూడా ప‌డింది. క‌ర్నాట‌క‌లో ఓడిపోయిన బీజేపీ, తెలంగాణ‌లో కూడా డీలా ప‌డిపోయింది. తెలంగాణ బీజేపీలో చేరిక‌లు లేక‌పోగా,…

తెలంగాణ‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రభావం తెలంగాణ‌పై కూడా ప‌డింది. క‌ర్నాట‌క‌లో ఓడిపోయిన బీజేపీ, తెలంగాణ‌లో కూడా డీలా ప‌డిపోయింది. తెలంగాణ బీజేపీలో చేరిక‌లు లేక‌పోగా, అంత వ‌ర‌కూ జాయిన్ కావాల‌ని అనుకున్న వారంతా కాంగ్రెస్ వైపు చూడ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. త్వ‌ర‌లో పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు త‌దిత‌ర నేత‌లంతా కాంగ్రెస్‌లో చేర‌నున్నారు.

దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోంద‌ని బీఆర్ఎస్ అప్ర‌మత్త‌మైంది. కాంగ్రెస్ ల‌క్ష్యంగా బీఆర్ఎస్ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి , భ‌ట్టి విక్ర‌మార్క ..ఇలా నాయ‌కులంతా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని ఆక‌ర్షించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నాల్ని తీవ్ర‌త‌రం చేశారు. భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌స్తుతం పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భ‌ట్టి పాద‌యాత్ర‌పై తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి త‌న‌దైన రీతిలో హిత‌వు చెప్పారు.

ఎర్ర‌టి ఎండ‌లో భ‌ట్టి విక్ర‌మార్క న‌డిచి ఆరోగ్యం పాడు చేసుకోవ‌ద్ద‌ని గుత్తా సూచించ‌డం గ‌మ‌నార్హం. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర‌కు గ‌మ్యం, గ‌మ‌నం లేద‌ని విమ‌ర్శించారు. న‌ల్గొండ క్లాక్ ట‌వ‌ర్ వ‌ద్ద కాంగ్రెస్ నాయకులు స‌భ పెడితే అట్ట‌ర్ ప్లాప్ అయ్యింద‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి స్థిమితం లేద‌ని త‌ప్పు ప‌ట్టారు. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు కేసీఆర్ మాత్ర‌మే అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోస‌మే తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింద‌న్నారు. అంతే త‌ప్ప  కేంద్రంలోని బీజేపీ పెత్తనం చేయ‌డానికి కాద‌ని గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య చేశారు. తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌ల పాద‌యాత్ర‌లు చెప్పుకోత‌గ్గ స్థాయిలో జ‌రుగుతున్నాయి. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ‌లో కూడా ఆశ‌లు చిగురించాయి. దీంతో మొద‌టి నుంచి కాంగ్రెస్ వాది అయిన త‌న‌ను సీఎం అభ్య‌ర్థిగా పార్టీ బ‌రిలో దింపుతుంద‌ని భ‌ట్టి ఆశిస్తున్నారు.