అస్తిత్వం కాపాడుకునేందుకు ప్రొఫెసర్ తాపత్రయం!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తన కృషి, పాత్ర కీలకం అయినప్పటికీ.. తెలంగాణ రాజకీయాల్లో అసలు దిక్కూ మొక్కూ లేని స్థితిలో ముందుకు సాగుతున్న నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం.  Advertisement కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తన కృషి, పాత్ర కీలకం అయినప్పటికీ.. తెలంగాణ రాజకీయాల్లో అసలు దిక్కూ మొక్కూ లేని స్థితిలో ముందుకు సాగుతున్న నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం. 

కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ శక్తులు ఐక్యమవుతున్న తరుణంలో.. కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీ.. కాంగ్రెసులో విలీనం అవుతుందనే పుకార్లు ముమ్మరంగా వచ్చాయి. విలీనం కోసం కాంగ్రెసు పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడు.. కోదండరాం అప్పటికప్పుడు ఖండించకుండా తమ పార్టీ నాయకులతో మాట్లాడి చెబుతానని ప్రకటించడం కూడా.. ఆయన సుముఖంగానే ఉన్నారనే సంకేతాలు ప్రజల్లోకి పంపింది. అయితే. కోదండరాం ఈ వార్తలను ఖండించారు. తెజస ఏ పార్టీలోనూ విలీనం కాబోయేది లేదని తేల్చిచెప్పారు. అదే సమయంలో తమ పార్టీ కార్యచరణ ప్రణాళికను కూడా ఆయన ప్రకటించారు.

కోదండరాం తెలంగాణ జనసమితి పార్టీని రాజకీయంగా అధికారం దిశగా నడిపించడంలో తొలినుంచి విఫలం అవుతూనే ఉన్నారు. పార్టీ స్థాపించిన తర్వాత.. రైతు సమస్యలపై చాలా గట్టిగానే పోరాడారు. రాష్ట్రంలో పర్యటనలు నిర్వహించారు. అయినా సాధించిన ప్రయోజనం మాత్రం లేదు. 

తాజాగా, ఈనెల 21న ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అయిన అక్కంపేట నుంచి మేడారం వరకు తెలంగాణ బచావో యాత్ర నిర్వహిస్తామని కోదండరాం ప్రకటించడం గమనార్హం. ధరణి, తెలంగాణ బచావో పేరుతో యాత్రలో సభలు నిర్వహిస్తారట. 

ప్రొఫెసర్ గారి కార్యచరణ ప్రణాళిక బాగానే ఉంది. కానీ.. ఆయన సాధించగల ఫలితం ఎంత? అనేదే అర్థం కాని సంగతి. ఎందుకంటే.. గతంలో కోదండరాం ఇలాంటి యాత్రలు చాలానే చేశారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆదరణ కనిపించడమే గానీ.. పార్టీకి ఓట్ల పరంగా ఏమీ లాభం దక్కలేదు. కాకపోతే, ఈసారి మాత్రం.. పార్టీ తరఫున స్వయంగా ఇలాంటి యాత్ర చేయడం వలన.. కాంగ్రెసులో విలీనం కావడం లేదు అని ప్రజలు నమ్మడం మాత్రం సాధ్యం అవుతుంది. ఆ రకంగా పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే కోదండరాం యాత్ర చేస్తున్నట్టుగా ఉంది. 

కాంగ్రెసు పార్టీ తరఫున ప్రొఫెసర్ గతంలో వేర్వేరు సందర్భాల్లో ఎన్నికల్లో పోటీచేశారు. కానీ.. ఎన్నికలను ఎదుర్కొనేప్పుడు.. ఆయనకు కాంగ్రెసు పార్టీనుంచి లభించిన సహకారం చాలా తక్కువ. ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ ఆయనను లైట్ తీసుకుందనే చెప్పాలి. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు వారి పార్టీ అవసరాలకోసం కోదండరాం ను తమలో విలీనం కావాలనే ప్రతిపాదన పెట్టింది. 

అయితే అలాంటి ప్రయత్నం చేస్తే అది ఆత్మహత్యా సదృశం అవుతుందని కోదండరాం గుర్తించినట్లున్నారు. విలీనం తర్వాత.. అసలే నిత్యం ముఠాకక్షలతో వర్ధిల్లుతూ ఉండే ఆ పార్టీలో తనకు దక్కగల ప్రాధాన్యం ఏమీ ఉండదని.. దానికంటె వారి జోలికి వెళ్లకపోవడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నారు. కాకపోతే.. అస్తిత్వ పరిరక్షణే ఆయనకు ప్రయాసగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.