త‌మ్మినేనికి షాక్ ఇచ్చిన ష‌ర్మిల!

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రానికి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల షాక్ ఇచ్చారు. సీపీఎం ఆఫీస్‌కెళ్లి, మీడియాతో మాట్లాడుతూ త‌మ్మినేని ఎదుటే ఆ పార్టీ వైఖ‌రిని త‌ప్పు ప‌ట్టారు. దీంతో సీపీఎం నేత‌లు…

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రానికి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల షాక్ ఇచ్చారు. సీపీఎం ఆఫీస్‌కెళ్లి, మీడియాతో మాట్లాడుతూ త‌మ్మినేని ఎదుటే ఆ పార్టీ వైఖ‌రిని త‌ప్పు ప‌ట్టారు. దీంతో సీపీఎం నేత‌లు ఖంగుతిన్నారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాల‌న్నింటిని ఏక‌తాటిపైకి తెచ్చేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇవాళ ఆమె కోదండరామ్‌ను క‌లిసి త‌న ఉద్దేశాన్ని చెప్పారు.

ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మైతే త‌ప్ప ప్ర‌భుత్వాన్ని ఒప్పించ‌లేమ‌ని ష‌ర్మిల అన్నారు. ష‌ర్మిల ప్ర‌తిపాద‌న‌పై పార్టీలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కోదండ‌రామ్ హామీ ఇచ్చారు. అనంత‌రం ఆమె సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రానికి ఫోన్ చేసి వెళ్లారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో క‌లిసి రావాల‌ని త‌మ్మినేనికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. అనంత‌రం త‌మ్మినేని, ష‌ర్మిల మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు.

ష‌ర్మిల మాట్లాడుతూ బీజేపీకి బీ టీమ్‌గా త‌న పార్టీని సీపీఎం విమ‌ర్శించ‌డాన్ని ఆమె త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌భుత్వంపై పోరాటంలో క‌లిసి రావాల‌ని ఎప్పుడైనా క‌నీసం త‌న‌కు ఫోన్ చేశారా అన్నా? అని త‌మ్మినేనిని నేరుగానే ప్ర‌శ్నించారు. మునుగోడులో బీఆర్ఎస్‌కు బీ టీమ్‌గా వామ‌ప‌క్షాలు ప‌ని చేశాయ‌ని ష‌ర్మిల చుర‌క‌లు అంటించారు. ప్ర‌భుత్వంపై పోరాటంలో భాగంగా అంద‌రం క‌లిసి ప‌ని చేద్దామ‌ని తాను ఆహ్వానించ‌డానికి వ‌చ్చాన‌న్నారు.

అనంత‌రం త‌మ్మినేని వీర‌భ‌ద్రం మాట్లాడుతూ సోద‌రి ష‌ర్మిల మ‌ర్యాద‌ను నిలుపుకోలేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మును గోడులో బీఆర్ఎస్‌కు బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ఇచ్చామ‌న్నారు. ఇదేమీ ర‌హ‌స్యం కాద‌న్నారు. జాతీయ పార్టీ కావ‌డంతో త‌మ‌కు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ కార్యాల‌యానికే వ‌చ్చి విమ‌ర్శించ‌డం బాగా లేద‌న్నారు.  

ఇదిలా వుండ‌గా ష‌ర్మిల రాజ‌కీయ నాట‌కాలు మానుకోవాల‌ని ఒక‌ట్రెండు రోజుల క్రితం త‌మ్మినేని విమ‌ర్శించారు. దీనిపై వైఎస్సార్‌టీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. త‌మ్మినేనిని వామ‌ప‌క్ష న‌టుడిగా అభివ‌ర్ణించారు. బీఆర్ఎస్ నేత హ‌త్య నుంచి బ‌ట‌య‌ప‌డేందుకే మునుగోడు ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి త‌మ్మినేని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌నే ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.