Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఈ ఏడాది 15 ఉప ఎన్నికలా..? సాధ్యమేనా?

ఈ ఏడాది 15 ఉప ఎన్నికలా..? సాధ్యమేనా?

తెలంగాణలో ప్రజా సమస్యలను అన్ని పార్టీలు (అధికార పార్టీ సహా) గాలికి వదిలేశాయి. ఒక్క మునుగోడు ఉప ఎన్నికనే పట్టుకొని వేలాడుతున్నాయి. అది అసలు జరుగుతుందో జరగదోనని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. జరగడానికి ఎంత అవకాశం ఉందో, జరగకపోవడానికీ అంతే అవకాశం ఉందంటున్నారు. ఆ విషయం అలా పక్కనుంచితే బీజేపీ మాత్రం రెచ్చిపోతున్నది. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ కు రాజీనామా చేశాడో అప్పటి నుంచి బీజేపీ నాయకుల ఆవేశానికి హద్దు లేకుండా ఉంది. అప్పుడే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫీలింగ్ లో ఉన్నారు కమలం పార్టీ నాయకులు. మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుతామంటున్నారు.

కానీ కేసీఆర్ ను ఎదుర్కోవడం అనుకున్నంత సులభం కాదు. కేసీఆర్ ఓ పక్క ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నట్లు పైకి కనబడుతున్నా ఉప ఎన్నిక జరగకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చనే ప్రచారమూ జరుగుతూనే ఉంది. మొన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు ...సిద్ధంగా ఉండండి అని కార్యకర్తలతో అన్నారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఆయన అన్నారని ఎక్కువమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం దూకుడు మరింతగా పెంచుతున్నారు. రాష్ట్రంలో ఇంకా చాలా ఉప ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. 

తమతో 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. చెప్పారు. అది కూడా ఏడాదిలోనే రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బండి పేర్కొన్నారు. అంటే ....15 ఉప ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారని అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ ఎమ్మేల్యేలో, కాంగ్రెస్ ఎమ్మేల్యేలో ఆయనతో టచ్ లో ఉండొచ్చు. కాదనం. కానీ టచ్ లో ఉన్నవాళ్ళంతా వెంటనే రాజీనామా చేస్తారా? చేయగానే ఉప ఎన్నికలు వచ్చేస్తాయా? ఒక్క ఉప ఎన్నిక విషయంలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారంటే ఒకేసారి ఇన్ని ఉప ఎన్నికలొస్తే ఊరుకుంటారా? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో ఎనిమిది నెలల్లోపే సాధారణ ఎన్నికలు వస్తాయి. 

సాధారణంగా ఎన్నికల ఏడాది అంటూ పాలనలో చివరి ఏడాదిని చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఏడాది మొత్తం పాలక పార్టీ.. ప్రతిపక్షాలు అన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతాయి. మరో పని పెట్టుకోవు. అలాంటి ఎన్నికల ఏడాది తెలంగాణలో వచ్చేసింది. అయితే ఇప్పుడు పార్టీలన్నీ తమ శక్తియుక్తులు ఉపఎన్నిక మీద పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే.. మరో పధ్నాలుగు నెలలే ఉన్నాయి. తెలంగాణలో బీజేపీకే గాలి ఉంది అని నిరూపించే ప్రయత్నంలో ఆ పార్టీ ఉపఎన్నికలు కోరుకుంటోంది. గతంలో టీఆర్ఎస్ ఇలా ఉపఎన్నికల రాజకీయాలు చేసింది. రాజీనామాలు చేసి ఉపఎన్నికలు తెచ్చి భారీ మెజార్టీలతో గెలిచి తమకు ఉన్న పట్టుని చూపించింది. ప్రజల్లో ఆదరణ పెంచుకుంది.

అదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయాలనుకుంటోంది. గతంలో మాదిరిగా ఆరు నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేసీఆర్‌కు ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే తర్వాత ముందస్తు ఉండదని తేల్చేశారు. ఇప్పుడు అలాంటి ప్రచారం జరగడం లేదు. కానీ ఇప్పుడు బీజేపీ ఉపఎన్నికల వ్యూహంతో కేసీఆర్ మళ్లీ ముందస్తు గురించి ఆలోచించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఉపఎన్నికల పేరుతో రాజకీయ రచ్చ పెట్టుకోవడం కన్నా ముందస్తు ఎన్నికలకు వెళ్తే బెటరన్న ఆలోచన టీఆర్ఎస్ పెద్దల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఇటీవల వెల్లడైన పలు సర్వేల్లో బీజేపీ పుంజుంకుందని చెప్పినా.. టీఆర్ఎస్ మాత్రం అగ్ర స్థానంలోనే ఉంది. ఆ మూడ్ ఉపఎన్నికలు దెబ్బతీస్తే కష్టమన్న చర్చ టీఆర్ఎస్‌లో సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంచనా వేయడం కష్టం. తమను ట్రాప్‌లో లాగాలనుకున్న వారికి రివర్స్ ట్రాప్‌లోకి లాగగలరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?