Advertisement

Advertisement


Home > Politics - Telangana

పార్లమెంటుకు రానక్కరలేదు..!

పార్లమెంటుకు రానక్కరలేదు..!

ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న సంగతి తెలిసిందే కదా. సాధారణంగా పార్లమెంటు సమావేశాలు కీలకం కాబట్టి అన్ని పార్టీలు తమ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తూ ఉంటాయి. 

కానీ బీజేపీ మాత్రం కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ కు పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఎందుకిలా చేసింది? బండికి వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉన్నాయా? తానూ హాజరు కాలేనని వేడుకున్నాడా? ఇలాంటిదేమీ కాదు.

పార్లమెంటులో ప్రభుత్వంతో తీవ్రంగా ఫైట్ చేయాలని, రాష్ట్ర సమస్యల మీద కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. దీంతో ఆ పార్టీ ఎంపీలు తప్పనిసరిగా కేంద్రాన్ని నిలదీస్తారు. అవసరమైతే ఆందోళన చేస్తారు. 

పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులో నిరసనలు తెలియజేయాలని, అనేక కీలక అంశాలను లేవనెత్తాలని, పార్లమెంటు ఉభయ సభలలో ఒక పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని ఎంపీలకు కేసీఆర్ చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్రాన్ని పార్లమెంట్‌లో ఎండగట్టాలన్నారు.

రాష్ట్రానికి అన్యాయం చేయడంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టాలని, ప్రజల ఆకాంక్షలను కూడా ప్రతిబింబించాలని చెప్పారు. వ్యవసాయం, నీటిపారుదల, వ్యవసాయ అనుబంధ రంగాల్లో విప్లవాత్మక విధానాలను ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానాన్ని సాధించిందని, కానీ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులకు గురి చేయడాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని కేసీఆర్ సూచించారు. కాబట్టి టీఆర్ఎస్ ఎంపీలు సభలో దూకుడుగానే వ్యవహరిస్తారు. కాబట్టి టీఆర్ఎస్ చేసే ఆరోపణలకు బీజేపీ దీటుగా సమాధానం చెప్పాలి కదా. దానికి మీడియాలోనూ బాగా కవరేజీ కావాలి  కదా. 

అందుకే బండి సంజయ్ తెలంగాణలోనే ఉండి పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు చేసే ఆరోపణలకు, విమర్శలకు దీటుగా, ఘాటుగా సమాధానం చెప్పాలని అధిష్టానం భావించింది. అందుకే ఆయనకు పార్లమెంటుకు హాజరు కానక్కరలేకుండా పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే రాష్రపతి ఎన్నికల రోజున పార్లమెంటుకు వచ్చి ఓటు వేయాలని చెప్పింది. 

పార్లమెంటు సమావేశాల నుంచి మినహాయింపు పొందిన బండి సంజయ్ కు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రచారం చేయాలని, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి వివరించాలని చెప్పింది. మరి బండి టీఆర్ఎస్ మీద ఏ విధమైన మాటల దాడి చేస్తారో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?